Idream media
Idream media
వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో పంజాబ్ కూడా ఉంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఫలితంగా అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు కూడా. ఈ నేపథ్యంలో మరింత గట్టిగా దృష్టి పెట్టి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తహతహలాడుతుంటే.. పార్టీలో మొదలైన రచ్చ .. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనసాగుతూనే ఉంటోంది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు పార్టీలో కుంపట్లు రేపాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలగజేసుకుని సిద్ధూకు సముచిత స్థానం కల్పించారు. పంజాబ్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని చేశారు. అయితే.. రాజకీయాల్లో ఎక్కడా `నమ్మకం` అనేది లేదని.. నమ్మితే.. కష్టమేనని మరోసారి నిరూపించారు.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.
సిద్ధూ మాటలు నమ్మి, భక్తికి మురిసి రాహుల్, ప్రియాంకలు ఆయనను కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఆయనకు పార్టీ మేలు చేస్తే.. ఆయన చర్యలు పార్టీకి కీడు చేసేలా మారుతున్నాయి. సిద్ధూ తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉంది. యువ నాయకుడు ఫైర్ బ్రాండ్ కావడంతో సిద్ధూ అయితే.. బీజేపీకి చెక్ పెడతాడని.. పార్టీని డెవలప్ చేస్తాడని భావిస్తే.. రెండు నెలలకే కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేయడమే కాకుండా.. సిద్ధూ బాటలో మరికొందరు నడిచేందుకు కారణమవుతున్నాడు. దీంతో తన వ్యక్తిగత స్వార్థం కోసం.. రాహుల్ ప్రియాంకలకు భారీ షాక్ ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆది నుంచి కూడా సిద్ధూ వ్యవహారంపై అనుమానంతో ఉన్న సోనియా.. సీనియర్ అయిన.. అమరీందర్ వైపే ఉన్నారు. కానీ రాహుల్ ప్రియాంకలు మాత్రం.. తమ పట్టు నెగ్గించుకున్నారు.
సిద్దూ `కోరిక` మేరకు అమరీందర్‌తో స్వచ్ఛందంగా రాజీనామా చేసే పరిస్థితి తీసుకువచ్చారు. ఇక అప్పటి వరకు ఈ సీఎం స్థానం..పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకే దక్కుతుందని.. సిద్ధూ అనుకున్నాడు. వాస్తవానికి ఈ పీసీసీ సీటు కూడా రాహుల్ ముచ్చపడి ఇచ్చుకున్నదే. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. వారిని కాదని.. రాహుల్ సిద్ధూకు ఈ పదవి ఇచ్చారు. అయితే.. ఈ క్రమంలో ఆయన పార్టీని డెవలప్ చేయకుండా.. తన సొంత ప్రయోజనాల కోసం పాకులాడాడనే వాదన ఉంది. సిద్ధూ కోసమని ఇంత చేసిన రాహుల్ ప్రియాంకలకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండానే పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసేశారు. దీంతో రాహుల్ ప్రియాంకలకు నోట మాట లేకుండా పోయిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ఆయన తీరు వారిని ఇరకాటంలో పడేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.