వీరయ్య 12 గంటల రైలు ప్రయాణం

వచ్చే నెల పదమూడున విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్ల కోసం దర్శకుడు బాబీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొత్త తరహా ప్లానింగ్ కు సిద్ధమవుతోంది. అందులో భాగంగా వచ్చే నెల 8 లేదా అంతకు ఒకటి రెండు రోజుల ముందు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. అందులో విశేషం ఏమి లేదు కానీ అక్కడికి వెళ్లే విధానాన్ని మాత్రం కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ని బుక్ చేసి ఆ రోజు వేడుకకు చేరేలా సిద్ధం చేస్తారట. ఒక్కో భోగిలో ఒక్కో టీమ్ ఉంటుంది. అంటే మీడియా, ప్రొడక్షన్ టీమ్, ఫ్యాన్స్ ఇలా వేర్వేరుగా సెట్ చేస్తారు.

ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దారిపొడవునా ఈ జర్నీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. గంటకోసారి భోగి మారుతూ నేరుగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు పంచుకుంటూ పనిలో పని ఇంటర్వ్యూలు కూడా అందులోనే ఇచ్చేస్తారు. గతంలో ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ కి ఇలా భారీ ఎత్తున చేశారు కానీ ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ విడిగా వెళ్ళాడు. ఇప్పుడు చిరు అలా కాకుండా విమానం బదులు రైలులో కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకుంటూ వెళ్తారన్న మాట. ప్రస్తుతం ఇది ప్రణాళిక స్టేజిలో ఉంది. అంతా ఫిక్స్ అయ్యాక అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ మీడియాలో కొందరికి సిద్ధంగా ఉండమనే కబురైతే అందింది

భారీ అంచనాలు మోస్తున్న వాల్తేరు వీరయ్యకు బాస్ పార్టీ సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం మంచి కిక్ ఇచ్చింది. పాతిక మిలియన్ల వ్యూస్ తో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. వీరసింహారెడ్డిలో జై బాలయ్య ఇందులో సగం దగ్గరే ఆగిపోయింది. ఈ విషయంలో తమన్ కంటే దేవిశ్రీ ప్రసాదే ముందుండటం గమనార్హం. ప్రస్తుతం విదేశాల్లో పాట షూట్ లో ఉన్న చిరంజీవి శృతి హాసన్ లు వాటి చిత్రీకరణ పూర్తి కాగానే తిరిగి వచ్చేస్తారు. అక్కడితో గుమ్మడికాయ కొట్టినట్టే. హైదరాబాద్ లో మరో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటోంది. కేవలం ముప్పై రోజుల కంటే తక్కువ నిడివి ఉన్న నేపథ్యంలో మైత్రి సంస్థ ప్రమోషన్ల కోసం పరుగులు పెట్టాల్సిందే

Show comments