Idream media
Idream media
మనిషి జీవితం లోతయింది. అది అనంత ప్రవాహం. అన్నీ కథలే. కానీ అన్ని కథలూ సినిమాకి పనికి రావు. పనికి రావచ్చు కూడా! చెప్పేవాడి ప్రతిభ. ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమం కూడా కథే. చనిపోయిన రైతు కథ చెప్పొచ్చు. ఉద్యమాన్ని నీరు కార్చేవాడి కథ కావచ్చు. అందరి కథని చెప్పలేం. ఒక్కడి కథతో అందరిదీ చెప్పాలి.
ఒక నదీ ప్రవాహం నుంచి కాసిన్ని నీళ్లు తెచ్చి ప్రేక్షకులకి రుచి చూపించడమే కథ. మా చిన్నప్పుడు పురుగుల మందు వాడకం బాగా తక్కువ. ఇపుడైతే ప్రత్యేకంగా వెళ్లి ఎక్కువ ధర పెట్టి ఆర్గానిక్ కొంటున్నాం. కానీ అప్పట్లో అన్నీ ఆర్గానికే. ధాన్యం, కూరగాయలు రుచిగా వుండేవి. ఎరువులు, మందులు వచ్చి తిండి గింజల కొరత తీరింది. రుచి తగ్గింది. రోగాలు పెరిగాయి.
సినిమా కథ ఒకప్పుడు ఆర్గానిక్‌గా వుండేది. సాహిత్యం నుంచి కథలు పుట్టేవి. పుస్తకాలు బాగా చదివేవాళ్లు. ఇంగ్లీష్, హిందీ సినిమాల నుంచి ప్రేరణ, కాపీ కూడా వుండేది. అదంత సులభంగా వుండేది కాదు. మద్రాస్‌కి ఇంగ్లీష్ సినిమాలు బాగానే వచ్చేవి. సీన్లు లేదా కథ కాపీ కొట్టాలన్నా పదేపదే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి అన్నీ గుర్తు పెట్టుకుని, బయటికొచ్చి చాలా మరిచిపోయేవాళ్లు. కథ అనుకున్న తర్వాత, పాత్రల్ని బాగా స్టడీ చేసేవాళ్లు. నిత్య జీవితంలో ఎదురయ్యే మనుషులే సినిమాలో వుండేవాళ్లు. అప్పుడు కూడా ప్లాప్‌లుండేవి. ఫిప్టీ, ఫిప్టీ.
ఇపుడు ప్రపంచం చిన్నదైపోయింది. జపాన్‌లో హిట్టయిన సినిమాని 24 గంటల్లో చూడచ్చు. ఎన్ని రకాల కథలనైనా ప్లాన్ చేసుకోవచ్చు. క్రైం జానర్‌లో కథ అనుకుంటే ఆ టైప్ సినిమాలు పాతిక దొరుకుతాయి. స్టడీ చేయచ్చు. కథని స్క్రీన్ మీద బలంగా చెప్పడానికి డైరెక్టర్‌కున్న సాంకేతిక సౌకర్యం అంతాఇంతా కాదు. మరి రెండు గంటలు థియేటర్‌లో ఎందుకు కూర్చో లేకపోతున్నాం? ఎందుకంటే సినిమాతో పాటు ప్రేక్షకుడు కూడా ఎదిగాడు. మనం ఎదగలేదనుకుని డైరెక్టర్లు మూస సినిమాలు తీసి వదులుతున్నారు.
సినిమాలో చిన్నాచితకా వాళ్ల సంగతి పక్కన పెడితే కనీసం ప్రధాన పాత్రలకైనా ఒక క్యారెక్టర్ స్థిరంగా వుంటే మనం వాళ్లతో పాటు travel చేస్తాం. క్యారెక్టరైజేషన్ వుండకపోతే ఆ పాత్రలు ఎందుకట్లా ప్రవర్తిస్తున్నాయో అర్థం కాదు.
ఈ మధ్య చూసిన వాటిలో చెత్త సినిమా అల్లుడు అదుర్స్. కొంచెం కూడా పేపర్ వర్క్ జరిగినట్టు లేదు. కథ ఇష్టమొచ్చినట్టు పోతూ వుంటుంది. ప్రకాష్‌రాజ్ పాత్ర మరీ ఘోరం. సామాజిక స్పృహ వున్న నటుడిగా ఆయనంటే చాలా మందికి గౌరవం. సినిమా ఒప్పుకునే ముందు కథ కూడా వినడా అని అనుమానం. విని కూడా అరిగిపోయిన , అధ్వాన్న పాత్రలు చేస్తున్నాడా? డబ్బుల కోసమే అయితే ఆయన ఇట్లాంటి పాత్రలు వేయడం మానుకోవాలి. లేదంటే రాజకీయ నాయకుల్ని విమర్శించడం మానుకోవాలి. ఎందుకంటే రాజకీయం, డబ్బు రెండూ వేర్వేరు కాదు.
జాంబిరెడ్డిలో అయితే ఒక్క క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాదు. రెడ్ కూడా అంతే. దొంగ పనులు చేసేవాడు వున్నట్టుండి మంచిగా ప్రవర్తిస్తూ వుంటాడు. మాస్టర్‌లో హీరో ఎప్పుడూ ఎందుకు తాగుతుంటాడో తెలియదు. ఏదో చెప్పారు కానీ, రిజిస్టర్ కాదు. వున్నంతలో క్రాక్ కొంచెం నయం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు కాసేపు గుర్తుంటాయి. హీరో క్రాక్ కాబట్టి , ఎప్పుడు ఎట్లయినా ప్రవర్తించవచ్చు.
సేంద్రియ ఎరువులు, పురుగుల మందుల్ని చూసి భయపడుతున్నట్టు కథలు కూడా ఆర్గానిక్‌గా వుండాలి. సినిమాలో కనిపించేవాళ్లు మనుషుల్లా కనిపిస్తే చాలు. ఈ మధ్య వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో నేటివిటిని డైరెక్టర్ వినోద్ బాగా పట్టుకున్నాడు. కొంత సాగతీత వున్నా గుంటూరుని సినిమాలో చూపించాడు. రెండో సినిమాకి హైదరాబాద్‌లో సెటిలై గుంటూరుకి వెళ్లడు కాబట్టి అది గ్యారెంటీగా హైబ్రీడ్ పంటే!