పెళ్లి కాని వారికి ప్రభుత్వం శుభవార్త.. ప్రతి నెల పెన్షన్‌!

పెళ్లి కాని వారికి ప్రభుత్వం శుభవార్త.. ప్రతి నెల పెన్షన్‌!

ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారులకు కూడా పెళ్లి చేసేవారు. ఆడపిల్లల విషయంలో అయితే.. ముక్కు పచ్చలారని చిన్నారులను ఏకంగా ముసలి వాళ్లకు సైతం కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడంతో.. యువత వివాహం విషయంలో ఆలస్యం చేస్తున్నారు. దాంతో చాలా మందికి పెళ్లీడు దాటి పోతున్నా సరే.. వివాహం కావడం కష్టంగా ఉంటుంది. పెళ్లి కాకుండా మిగిలిపోతున్న వారిలో యువకులే అధికంగా ఉంటున్నారు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేయగా.. వివాహాలు అవుతున్నాయి. కొందరు అయితే అలానే మిగిలిపోతున్నారు. ఈ ‍క్రమంలో పెళ్లి కాని వారి కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారికి ప్రతి నెలా పెన్షన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

అయితే ఈ పెన్షన్‌ స్కీమ్‌ మన రాష్ట్రంలో కాదు.. హర్యానాలో. పెళ్లి కాని వారికి పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ పెన్షన్‌ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి.. విడుదల చేస్తామని.. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. కర్ణాల్ జిల్లా కాలాంపురా గ్రామంలో జరిగిన జన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పథకం గురించి ప్రకటన చేశారు.

పెళ్లి కాని ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన పెన్షన్ కోసం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఖట్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా పెళ్లి కాని వారి కోసం ఈ పెన్షన్‌ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఖట్టర్ తెలిపారు. ఈ పథకం కింద పెళ్లి కాని వారికి నెలకు రూ. 3 వేల రూపాయలు పెన్షన్‌ అందజేస్తామని తెలిపారు. మరి ఈ పెన్షన్‌ పథకానికి అర్హులు ఎవరు.. నియమ నిబంధనలు ఏంటి అంటే..

ఈ పెన్షన్‌ ఎవరికి ఇస్తారు..

పెళ్లి కాని పురుషులు, స్త్రీలకు ఈ పెన్షన్ అందజేస్తామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ స్పష్టం చేశారు. 45- 60 ఏళ్ల లోపు ఉన్న అవివాహిత స్త్రీ,పురుషులు ఈ పథకానికి అర్హులు అవుతారని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఈ పథకానికి అర్హులైన పెళ్లి కాని వారికి ప్రతి నెల రూ. 3 వేల పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. నెల రోజుల లోపే ఈ పథకానికి శ్రీకారం చుడతామని ఖట్టర్ వ్యాఖ్యానించారు. అంటే ఆగస్టు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అదే విధంగా ఇప్పటివరకు హర్యానాలో పెన్షన్ పొందుతున్న వృద్ధులకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం హర్యానాలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ మొత్తాన్ని రానున్న 6 నెలల్లో రూ. 3 వేలకు పెంచుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

నిబంధనలు..

ఒక్కసారి కూడా పెళ్లి కాకుండా అవివాహితులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఖచ్చితంగా హర్యానాలో నివసిస్తూ ఉండాలని.. వారి ఆదాయం సంవత్సరానికి రూ. 1.80 లక్షలకు మించకూడదని నిబంధన పెట్టారు. ఈ పథకం కింద హర్యానా రాష్ట్రంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులు పింఛను పొందేందుకు అర్హులు అవుతారని అంచనా వేస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ తీసుకున్న నిర్ణయంపై అవివాహిత స్త్రీ, పురుషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వయసు మీద పడి.. ఏ తోడు లేకుండా బతుకుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments