వానలు కుర‌వొద్దు వాన దేవుడా : కొత్త మేయ‌ర్ వింత విన‌తి…

గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో భారీ వ‌ర్షాలు మ‌హా న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేశాయి. వంద‌కు పైగా కాల‌నీలు వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యాయి. రోడ్ల‌పై వ‌ర‌ద పోటెత్తింది. వ‌ర‌ద ప్ర‌వాహంలో వాహ‌నాలు, మ‌నుషులు కొట్టుకుపోయారంటే ఆ బీభ‌త్సం ఎంత‌టిదో ఊహించుకోవ‌చ్చు. జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని శివార్లలో అధికారిక‌ లెక్క‌ల ప్రకారం 33 మంది మరణించారు. అన‌ధికారికంగా లెక్క అంత‌కు మించి ఎక్కువే ఉండొచ్చు. బాధితులు ఆర్త‌నాదాలు పెట్టారు. ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగం స‌మ‌స్తం ఉరుకులు, పెరుగులు పెట్టింది. ఏపీ వంటి ప‌క్క రాష్ట్రాలు కూడా త‌మ వంతు సాయం అందించాయి.

ఆ వారం రోజులూ చినుకు ప‌డిందంటే చాలు గ్రేట‌ర్ వాసుల గుండె గుబేల్ మ‌నేది. రెండు నెల‌ల వ‌ర‌కూ వ‌ర‌ద ముంగిట నుంచి బాధిత ప్రాంతాలు కోలుకునే లేదు. ఇప్ప‌టికీ జీడిమెట్ల‌, ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్ లోని ఒక‌టి, రెండు కాల‌నీల్లో ఆ వ‌ర‌ద తాలూకు మ‌ర‌క‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అందుకే నాటి వ‌ర‌ద‌ల‌ను 112 ఏళ్ల హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో రెండో అతి పెద్ద విప‌త్తుగా అభివ‌ర్ణించారు. అక్టోబ‌ర్ 13న అత్య‌ధికంగా 32 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఎక్క‌డో చోట గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉండేది. నష్టపోయిన ప్ర‌తీ ఇంటికీ త‌క్ష‌ణ సాయం కింద రూ.10 వేలు, మృతుల కుటుంబాలకు రూ. 5 ల‌క్ష‌లు చొప్పున న‌ష్ట ప‌రిహారం అంద‌జేసింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. వ‌ర‌ద ప్ర‌భావానికి అధికంగా గురైన ఎల్బీనగర్‌, మహేశ్వరంలోని సీట్లన్నింటినీ అధికార పార్టీ కోల్పోయింది.

రాజేంద్రనగర్‌ సెగ్మెంట్​లో సగానికిపైగా బీజేపీ గెలుచుకుంది. ఎల్బీనగర్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. చైతన్యపురి, గడ్డి అన్నారం, నాగోల్‌, మన్సూరాబాద్‌, చంపాపేట్‌, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, హస్తినాపురం, లింగోజిగూడ స్థానాలను గెలుచుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు స్థానాలైన సరూర్‌నగర్‌, మహేశ్వరంలోనూ కమలం పార్టీ గెలుపొందింది. ఎన్నికలకు ముందు భారీ వర్షాలకు ఎల్బీనగర్‌లోని చాలా ప్రాంతాలు వరదలకు ఆగమయ్యాయి. టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పట్టించుకోలేదని, అందుకే ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని విశ్లేషకులు భావించారు. గ‌త జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో 99 స్థానాల నుంచి ఈసారి 56 స్థానాల‌కు అధికార పార్టీ ప‌డిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో వ‌ర‌ద‌లు సృష్టించిన గంద‌రగోళం కూడా ఉంద‌ని అంద‌రూ చెప్పుకొచ్చారు.

కొత్త మేయ‌ర్ గా ఎన్నికైన గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మివ్యాఖ్య‌ల‌తో నాటి వ‌ర‌ద‌లు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించే విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు అండ‌గా ఉంటామ‌ని, ఇటువంటి ప‌రిస్థితులు పున‌రావృతం కాకుండా శాశ్వ‌త చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పుకొచ్చారు. మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి మాత్రం హైదరాబాద్ వర్షాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఐదేళ్లూ వర్షాలు పడొద్దని దేవుణ్ని మొక్కుకుంటానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

గత ఏడాది కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన నేపథ్యంలో అటువంటిది పున‌రావృత‌మైతే హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారని.. ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. నాలాల ఆక్రమణలను తొలగించడం పెద్ద సమస్య అని ఆమె అంగీకరించారు.

వచ్చే ఐదేళ్లలో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాను ఏం చేస్తానో.. తన ప్రణాళికలు ఏంటో వివ‌రించ‌కుండా అస‌లు వాన‌లే ప‌డ‌కూడ‌ద‌ని కోరుకుంటాన‌ని చెప్ప‌డం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ భారీ వ‌ర్షాలు ప‌డితే ఆదుకోవ‌డానికి మీరేమీ చేయ‌రా..? దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంటారా అని కొంద‌రు.. రైన్ రైన్ గో అవే ,నో రెయిన్ నో గ్రౌండ్ వాట‌ర్, నో రెయిన్ నో డ్రింకింగ్ వాట‌ర్, నో రెయిన్ నో ట్రీస్ గ్రోత్ అని కొంద‌రు, ద్యావుడా.. అంటూ కామెడీ ఎమోజీల‌తో మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేయ‌గా, స్వ‌ల్ప మంది మాత్రం దేవుడిని కోరుకుంటాన‌న‌డంలో త‌ప్పేముందని స‌మ‌ర్థించారు. ఏదేమైనా బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలోకి వ‌చ్చాక ప్ర‌తీ అంశంపైనా ఆచితూచి స్పందించాల‌న్న విష‌యాన్ని విజ‌య‌ల‌క్ష్మికి తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న రాద్దాంతం ద్వారా తెలిసి ఉంటుందేమో!

Show comments