కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తరలిస్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో క్వారంటైన్ సెంటర్లలో తగిన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.. అందువల్ల కొన్నిచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పుల్హారా టౌన్‌లో ఉన్న పాఠశాలను తాత్కాలిక క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. సుమారు 150 మందిని బీహార్ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రానికి తరలించింది. కానీ సరైన వసతులు అక్కడున్న వారికి కల్పించలేదు. అక్కడివారికి నీటిని అందించడానికి వాటర్ టాంకర్ రావడంతో ఘర్షణ మొదలైంది. ఇదివరకు వీధి కుళాయిల దగ్గర ఘర్షణలు జరిగినట్లు క్వారెంటయిన్ కేంద్రంలో కూడా బిందెలు, బక్కెట్లు విసురుకుంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు.
ఈ తతంగం మొత్తం ఒకరు చరవాణిలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీంతో పోలీసులు క్వారెంటయిన్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు రుచికరమైన బలవర్ధక ఆహారం అందిస్తూ కరోనా సోకిన వారికి అందిస్తున్నారు. కాగా బీహార్ రాష్ట్రంలో 1,178 మందికి కరోనా నిర్దారణ కాగా 443 మందికి కరోనా బారినుండి కోలుకున్నారు. 731 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 7 గురు మరణించారు.