హుజురాబాద్ బై పోల్ డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో నియోజకవర్గంలో ప్రచారహోరు మరింత పెరగింది. ఈటల రాజేందర్ జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకునేందుకు సుమారు నాలుగున్నర నెలల సమయం దొరికింది. అయితే ఈ టైమ్ గ్యాప్ అభ్యర్థుల గ్రహబలాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదుకాని…గెలుపునకు అవసరమైన ప్రజాబలం లెక్కలను మాత్రం ఖచ్చితంగా తారుమారు చేయనుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలలోని ముఖ్యనాయకుల వలసలు జరిగాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు జరిగాయి.
ఎవరికి మేలు.. ఎవరికి చేటు…
ఆలస్యం..అమృతం..విషం అనే సామెత అన్నట్లు కొన్నిపార్టీలకు ఈ టైమ్ గ్యాప్ అనుకూలంగా మారగా, కొందరు అభ్యర్థులకు మైనస్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. తాత్కాలిక భావోద్వేగపు సానుభూతి ఓట్లకు భారీగా గండిపడనుంది. ముఖ్యంగా బీజేపీ తరఫున సిట్టింగ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ లెక్కలు తారుమారు అయ్యేందుకు ఛాన్స్ ఉంది. సానుభూతి ఓటింగ్ దూరమవడంతో పాటు కేసీఆర్ విసిరిన ఎన్నికల అస్త్రం దళితబంధుతో పాటు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల హామీలు ఈటల రాజేందర్ విజయానికి ప్రతికూలంగా మారనున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన బీజేపీ అగ్రనేతలు ఈటల రాజేందర్ ను ఉపఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు కూడా బీజేపీ తరఫున ఉపఎన్నికలో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను గెలిపించాలని బహరంగ సభల వేదికపై నుంచి కోరారు. . ఈటల కూడా రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే మకాం వేశారు. పాదయాత్ర కూడా చేశారు. టీఆర్ఎస్ లో తనను అవమానించారని ప్రజలకు వివరిస్తున్నారు ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్,.. ‘దమ్ముంటే హుజురాబాద్ నుంచి పోటీ చేయాలని’ సవాల్ కూడా విసిరారు.
గెలుపే లక్ష్యంగా ప్రచారం..
తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్లో గెలిచి, తెలంగాణలో తామే సూపర్ స్టార్లమని చెప్పేందుకు కేసీఆర్ అండ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. దూరమవుతున్నమెజారిటీ ఓటర్లైన అట్టడుగు వర్గాలను మరోసారి ప్రసన్ననం చేసుకునేందుకు పలు హామీలు ఇచ్చారు. దళితబంధుతో పాటు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గులాబీ పార్టీకి మేలు జరిగే అవకాశాన్నికొట్టివేయలేం.
యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ అతని గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేతగా ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న తన్నీరు హరీశ్ రావు నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు.
‘ టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి పేదోడికి డబ్బులు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ ప్రజల నుంచి గుంజుకుంటుందని’ హరీశ్ ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఓటర్లకు వివరిస్తున్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా నియోజకవర్గంలోని మకాం వేసి గులాబీ శ్రేణుల్ జోష్ నింపుతున్నారు. తమకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో పర్యటిస్తున్నారు. పార్టీ పై అసంతృప్తితో ఉన్న క్యాడర్ ను బుజ్జగించి.. నష్టం జరగకుండా చూసుకుంటున్నారు.
ఇక, తెలంగాణలో తన ఉనికిని కాపాడుకునేందుకు చెమటోడుస్తున్న కాంగ్రెస్, ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే ప్రచారంలో చాలా వీక్ గా ఉంది. అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగి ఉంటే కాంగ్రెస్ కు కొంతమేర ఉపయోగం జరిగేది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలకానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ ముప్పుతో పాటు వరుస పండగల నేపథ్యంలో దసరా తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 12లోగా హుజురాబాద్ ఉపఎన్నిక జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఉపఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీనియోజకవర్గాలు మూడు 3 ఎంపీ స్థానాల్లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అక్కడ కూడా ఉపఎన్నిక జరగనుంది.
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ దాఖలకు చివరితేది అక్టోబర్ 8
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేది అక్టోబర్ 13
అక్టోబర్ 30న పోలింగ్
నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన