Box Office : ఈ వారం కూడా బాక్సాఫీస్ డల్లే

కరోనా పుణ్యమాని వాయిదాల పర్వం ఎక్కువ కావడంతో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే శుక్రవారాలు మళ్ళీ చప్పగా మారిపోతున్నాయి. బంగార్రాజు ఉన్నంతలో మంచి నమ్మకాన్నే కలిగించినా మీడియం రేంజ్ సినిమాలు సైతం రిలీజుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. జనంలో ఓమీక్రాన్ భయాలేమో కానీ రోజు రోజుకు తగ్గిపోతున్న కలెక్షన్లు చూస్తూ ఎగ్జిబిటర్లకు మాత్రం వెన్నులో వణుకు వస్తోంది. ప్రతి సెంటర్ లో బంగార్రాజు, అఖండలు ఆడుతున్న థియేటర్లు తప్పించి మిగిలినవి కనీసం కరెంటు బిల్లులు కూడా వసూలు చేసుకోలేనంత ఇబ్బందిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దానికి తోడు ఏపిలో సగం సీట్ల ఆంక్షలు మొదలయ్యాయి

ఈ ఫ్రైడే మొత్తం నాలుగు సినిమాలు రాబోతున్నాయి. వధుకట్నం, ఉనికి, వర్మ వీడు తేడా 21న రానుండగా ఒక రోజు ఆలస్యంగా 22కి పద్మశ్రీని తెస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి ప్రేక్షకులకు అవగాహన లేనివే. వాళ్ళ దాకా ఎందుకు నిత్యం ఇండస్ట్రీలో తిరిగే మీడియాకు సైతం తెలిసింది తక్కువ. అంత లో ప్రొఫైల్ లో రిలీజవుతున్న ఈ చిత్రాలకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరే ఏదో ఒక కంటెంట్ వస్తోంది కదాని థియేటర్ల యజమానులు సంబరపడేందుకు లేదు. ఇటీవలి కాలంలో రెండు రోజులు దాటడమే గొప్ప అనేలా ఉంటున్నాయి ఇలాంటి మూవీ కలెక్షన్లు. ఈ నేపథ్యంలో ఏదైనా మేజిక్ ఆశించడం అత్యాశే.

విడుదలకు సిద్ధంగా ఉన్న డిజె టిల్లు, సత్యదేవ్ గాడ్సే, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖిలు ఈ డేట్ ని వదిలేయడం ఆశ్చర్యం. ఏ ఒక్కటి వచ్చినా వసూళ్ల పరంగా కొంత నిశ్చింత వచ్చేది. బంగార్రాజు మరీ పుష్ప, అఖండ రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు. పోటీకి తట్టుకోలేం జనమంతా దాన్నే చూస్తున్నారని భయపడేందుకు. అలాంటప్పుడు కనీసం ఒక్కరైనా వచ్చి ఉంటే బాగుండేది. ఇవాళ్టి నుంచి సగం ఆక్యుపెన్సీలోనూ బంగార్రాజు బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు. చాలా చోట్ల డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనవరిలో మొదటి ఫ్రైడేని చేతులారా బుగ్గిపాలు చేసిన నిర్మాతలు ఇప్పుడు మరో శుక్రవారం కూడా కృష్ణార్పణం చేశారు.

Also Read : South Movies : బంగారంలా మారబోతున్న సౌత్ మాస్

Show comments