బండారు బలం బయటపడింది!!

మాటలు చూస్తే కోటలు దాటుతాయి.. పనులు మాత్రం గుమ్మం దాటవు.. లేస్తే మనిషి కాదు.. కానీ లేవడమే కష్టం.. ఇలాంటి జాతీయాలన్నీ ఇప్పుడు సీనియర్ టీడిపి నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అచ్చంగా వర్తిస్తాయి  , మంత్రిగా, ఎమ్మెల్యేగా చాన్నాళ్లపాటు రాజకీయాలు చేసిన ఈ సీనియర్ ఈ పంచాయతీ ఎన్నికల్లో భార్యను సర్పంచ్ గా గెలిపించుకోలేక పరువు పోగొట్టుకున్నారు. గతంలో పరవాడ నియోజకవర్గం నుంచి గెలుపొంది న ఈయన 1995-99 మధ్య చంద్రబాబు మంత్రిమండలిలో మున్సిపల్ శాఖా మంత్రిగా పని చేశారు.

ఆ తరువాత చాన్నాళ్ల పాటుగ్యాప్ తీసుకుని 2014లో ఈసారి విశాఖపట్నంలో భాగమైన పెందుర్తి నుంచి గెలుపొందారు. కానీ క్యాబినెట్లో చోటు దక్కలేదు. కానీ ఆయన కుమారుడు, బంధువులు ఈ ఐదేళ్లలో పెందుర్తిలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ దెబ్బతో ఆయన 2019 ఎన్నికల్లో ఏకంగా కొత్త కుర్రాడైన అన్నం రెడ్డి అదీప్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమి తరువాత నుంచి అవకాశం వచ్చినపుడల్లా ముఖ్యమంత్రి వైఎస్ జన మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద విపరీతంగా విరుచుకుపడుతుంటారు. వెనకాముందూ చూడకుండా టీవీ చర్చల్లో సైతం నోరు పారేసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టిందని, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాళ్లు విసురుతూ ఇన్నాళ్లూ వార్తల్లో నిలిచారు.

మొత్తానికి ఆయన సత్తా చూపాలిసిన సమయం రానే వచ్చింది. దీంతో తన సొంత గ్రామమైన పరవాడ మండలం వెన్నెల పాలెంలో భార్య మాధవీలతను సర్పంచ్ గా బరిలో నిలిపారు వాస్తవానికి తన రాజకీయ ప్రస్థానం కూడా అక్కడి నుంచే ప్రారంభమవడం, గతంలో రెండుస్లార్లు అయన సర్పంచ్ గా గెలవడం, ఆ తరువాత ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేయడంతో తనకు ఆ గ్రామంలో పూర్తిగా ఆధిపత్యం ఉందని భావించి భార్యను బరిలో దించారు. కానీ అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిరో అన్నట్లుగా ఆమె ఏకంగా 464 ఓట్ల తేడాతో ప్రత్యర్థి అప్పారావు చేతిలో ఓడిపోయారు.

ఊల్లోని మొత్తం పది పంచాయతీ వార్డులు సైతం వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుపొందడంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా చెలామణి అవుతూ వచ్చిన బండారు అసలు బండారం సొంత ఊళ్ళోనే ఇలా బయటపడింది, మరోవైపు తనపై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అదీప్ రాజు భార్య శిరీష పెందుర్తిలోని రాంపురం సర్పంచ్ గా విజయం సాధించారు.

కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఇష్టానుపారి నోరు పారేసుకోవడం, అలవిమాలిన అవినీతి వంటి దుశ్చర్యల కారణంగానే ఆయన అప్పట్లో ఒటమిపాలవగా ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరడంతో ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్యకు సైతం గట్టి గుణపాఠం నేర్పారని అర్ధం అవుతోంది.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి బండారు సత్యనారాయణ పిల్లనిచ్చిన మామగారు కావటం గమనార్హం.

Show comments