దొంగ బాబాలపై ఖాకీ ఆవేశం – Nostalgia

ఇటీవలే మతోన్మాదం, దైవం మత్తులో మునిగి ఓ తల్లితండ్రులు చేజేతులా ఈడుకొచ్చిన తమ ఇద్దరు ఆడబిడ్డలను అతి కిరాతకంగా చంపిన దారుణ సంఘటన చూశాం కదా. నిజానికి కనిపించని దేవుడిని అడ్డం పెట్టుకుని పబ్బం గడిపే బాబాలు, మంత్రగాళ్ళు సంఘంలో వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. వీళ్ళను గుడ్డిగా నమ్మి తమ డబ్బుతో పాటు సర్వస్వం అర్పించిన అమాయకులు ఎందరో లెక్క చెప్పడం కష్టం. అయితే ఈ కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. సున్నితమైన అంశం కావడంతో జనం వీటిని రిసీవ్ చేసుకుంటారో లేదో అనే అనుమానం దర్శకరచయితల్లో ఉండటం వల్ల అంతగా సాహసించే వాళ్ళు కాదు.

కానీ ఈ భయానికి అతీతంగా కోడి రామకృష్ణ గారు చేసిన ప్రయత్నమే 1994లో వచ్చిన ఆవేశం. యాంగ్రీ యంగ్ మేన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ లవర్ బాయ్ గా అల్లరి ప్రియుడుతో మెప్పించాక గ్యాంగ్ మాస్టర్, అంగరక్షకుడు రూపంలో రెండు పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలతో సూపర్ హిట్లు కొడుతూ అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోడి రామకృష్ణ గారు దొంగ బాబాల దురాగతాలను బయటపెట్టే ఓ పోలీస్ ఆఫీసర్ కథను వినిపించారు. సెన్సిటివ్ గా అనిపించినప్పటికీ పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన స్క్రిప్ట్ మీద నమ్మకంతో వేరే ఆలోచించకుండా రాజశేఖర్ ఎస్ చెప్పేశారు.

నగ్మా, మధుబాల హీరోయిన్లుగా ఎంపిక కాగా ఎంఎం కీరవాణి సంగీతం, శరత్ ఛాయాగ్రహణం అందించగా త్వరగానే షూటింగ్ పూర్తయిపోయింది. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లోనూ అపారమైన ఖ్యాతి గడించిన ఓ బాబాను ఉద్దేశించి ఈ సినిమాలో నెగటివ్ గా చూపించారని పెద్ద దుమారమే రేగింది. ఆ క్యారెక్టర్ చేయడానికి తెలుగు నటులెవరూ సాహసించకపోవడంతో హిందీ నుంచి సురేంద్ర పాల్ సింగ్ ని తీసుకొచ్చి వేయించారు. అతనికి నప్పింది కూడా. సెన్సార్ ఇబ్బందులతో పాటు 1994 అక్టోబర్ 6న రిలీజయ్యాక కూడా ఆవేశం మీద గట్టి నిరసన వ్యక్తమయింది. ఊహించినట్టే సినిమా విజయం సాధించలేదు. కథలో ఉన్న లోపాల వల్ల అంకుశం కాంబినేషన్ మరోసారి మేజిక్ చేయలేకపోయింది. కానీ కొంతకాలం ఆవేశం టాక్ అఫ్ ది స్టేట్ గా మారిన మాట వాస్తవం.

Show comments