Breaking : రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ కన్నుమూత

ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (Andrew Symonds) మృతి చెందారు. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్‌ మరణించడం బాధాకరం. కారులో వేగంగా వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టి మరణించినట్టు సమాచారం. ఈ దిగ్గజ క్రికెటర్ మృతితో ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆండ్రూ సైమండ్స్‌ కి నివాళులు అర్పిస్తున్నారు.

సైమండ్స్ మృతి పట్ల అతనితో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లు నివాళులు అర్పిస్తున్నారు. సైమండ్స్ 2003, 2007 రెండు సార్లు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

 

ఆండ్రూ సైమండ్స్‌ క్రికెట్ ప్రయాణం..

1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో మొత్తం 5088 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 37.26 సగటుతో 133 వికెట్లు తీశాడు. 2004లో శ్రీలంకతో తన తొలి టెస్ట్‌ ఆడిన సైమండ్స్‌ మొత్తం 26 టెస్ట్ మ్యాచుల్లో 1463 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 టీ 20 మ్యాచులు ఆడి 337 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీశాడు.

IPLతో కూడా సైమండ్స్‌కు మంచి అనుబంధం ఉన్నది. మొదట హైదరాబాద్‌ డెక్కన్ ఛార్జర్స్‌కు, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు జట్ల తరఫున IPLలో 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆండ్రూ సైమండ్స్‌ ఆస్ట్రేలియా జట్టుని కష్ట సమయాల్లో చాలా సార్లు తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదుకున్నాడు.

Show comments