Idream media
Idream media
సవాళ్లు – ప్రతి సవాళ్లు రాజకీయాల్లో మామూలే. అయితే ఇటీవల కొద్ది కాలంగా ఈ సవాళ్ల రాజకీయం ఏపీలో జోరుగా సాగుతోంది. విశాఖలో వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో గతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరికొత్త సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే.. తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు రాజీనామా చేయటానికి సిద్ధమని.. మరి.. ఓడితే టీడీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ సవాల్ విసిరారు. ఈ సవాల్ ద్వారా జగన్ పర్యటన రద్దుపై విమర్శనాత్మక ప్రచారం చేస్తున్న టీడీపీ అండ్ కోకు పెద్దిరెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తిరుపతి ప్రచారంలో అనూహ్యంగా ఈ కొత్త సవాలును తెర మీదకు తీసుకొచ్చారు మంత్రి. ప్రజాహిత కార్యక్రమాలే వైసీపీకి బలమన్న ఆయన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి టూర్ రద్దు వెనుకున్న కారణాన్ని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం సభను రద్దు చేసుకున్నారని చెప్పారు.
అయితే, సీఎం సభ రద్దు చేసుకోవటానికి వెనుక టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ విసిరిన సవాలుతోనే అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే వివేక హత్య కేసులో తమకు.. తమ వారికి సంబంధం లేదంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేస్తారా? అని లోకేశ్ సవాలు విసరటం.. తాను చేస్తున్నట్లుగా లోకేష్ ప్రమాణం చేయటం వంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి వారికి ఊహించని షాక్ ఇచ్చినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది.
తిరుపతి లో తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రసక్తే లేదని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అయినప్పటికీ ఓ పక్క అధినేత చంద్రబాబునాయుడు, మరో పక్క ఆయన తనయుడు లోకేశ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. దీనిలో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా సవాల్ ను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడితే 20 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పటం ద్వారా.. వారికి గెలుపుపై ఉన్న ధీమా అర్థం అవుతోంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారాలన్న ఎత్తుగడతోనే పెద్దిరెడ్డి ఈ ప్రస్తావన తెచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. దీంతో పాటు లోకేష్ ప్రమాణం తెర వెనక్కి వెళ్లేలా చేయటమే పెద్దిరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇది తిరుపతి బై పోల్ లో టీడీపీకి ఇది ఊహించని ట్విస్ట్. మరి దీనిపై ఆ పార్టీ నాయకులు ఎవరైనా స్పందిస్తారా? చూడాలి మరి.