Idream media
Idream media
కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండో దశ కేసులు తగ్గిన క్రమంలో అన్ని రకాల కార్యకలాపాలు సాధారణంగా మారాయి. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. తెలంగాణలో అయితే సభలు, సమావేశాలు, పాదయాత్రలతో రాజకీయ నాయకులందరూ బిజీగా గడుపుతున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా గతంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ సహా ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అలాగే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బీఎస్సీలో చేరారు. ఆ సందర్భంగా కూడా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు బయటపడడంతో కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత యాక్టివ్ గా తిరుగుతున్న అంజన్ కుమార్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా మునపటి కంటే కాస్త కంట్రోల్ అయినప్పటికీ..ప్రతి రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వందల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవల మూడుచింతలపల్లి దళిత, గిరిజన దండోరా దీక్షలో అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నెల 26న అంజన్‌కుమార్‌కు జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు , పార్టీ నేతలు , కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
అంజన్ కుమార్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఏఐసీసీ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ ఫోన్‌చేసి పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, అన్నివిధాలుగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. అంజన్‌కుమార్ కుటుంబానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్‌చేసి పరామర్శిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆయన నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తో కలిసి అంజన్ కుమార్ యాదవ్ పలు ఆస్పత్రులను సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు.