రామ్ చరణ్ మీదే ఒత్తిడంతా

లాక్ డౌన్ సడలింపులు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టే. జనం ఎప్పట్లాగే రోడ్ల మీదకు వచ్చేశారు. ఆంక్షలు కొనసాగుతున్న కొన్ని రంగాలు తప్ప అన్ని వ్యాపార లావాదేవీలు ప్రారంభమయ్యాయి. షూటింగులు కూడా ఇంకో వారంలో స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాతలు ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే ఎవరు ముందు చేస్తారనే క్లారిటీ లేదు కానీ వివిధ స్టూడియోలలోని అన్ని ఫ్లోర్లు చాలా రోజులకు బుక్ అయిపోయినట్టుగా సమాచారం. ఇక విషయానికి వస్తే రామ్ చరణ్ మీద డబుల్ ఒత్తిడి ఉండటం ఖాయం. ఎందుకంటే ముందు ఆర్ఆర్ఆర్ బాలన్స్ వర్క్ పూర్తి చేయాలి. దీనికి తగ్గట్టే రాజమౌళి వచ్చే నెల నుంచి శరవేగంగా షూట్ ప్లాన్ చేసేలా ముందు చెర్రీ ఎపిసోడ్స్ కు తగ్గట్టు షెడ్యూల్ డిజైన్ చేశారట.

జూనియర్ ఎన్టీఆర్ తో కాంబో సీన్స్ కూడా ఇందులోనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత తారక్ సోలో సీన్స్, సాంగ్స్ తీస్తారు. దీనికి కారణం రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండటమే. సుమారు 45 నిమిషాల పాటు ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని వినికిడి. చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ తో పాటు రెండు ఫైట్లు ఒక పాట కూడా ఉంటాయట. కాల్ షీట్స్ సైతం ఎంత లేదన్నా నెలన్నర పైగా ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆర్ఆర్ఆర్ పూర్తి చేయగానే ఆచార్యలో ప్రవేశించాలి. అయితే రెండూ ఒకేసారి చేయొచ్చుగా అనే అనుమానం రావొచ్చు కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో చరణ్ మీసకట్టు కొనల్లో మెలితిరిగి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు పౌరుషాన్ని ప్రతిబింబించేలా అలా సెట్ చేశారు. అది సహజంగా ఉండేలా నిజంగానే చరణ్ అలా మీసాన్ని పెంచాడు. కానీ ఆచార్యలో అలా కాదు. రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్ఆర్ అయ్యాక కానీ ఆచార్య లో పాల్గొనడానికి లేదు.

రాజమౌళి సినిమా సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఆ స్లాట్ ని ఆచార్య తీసుకుంటే కలెక్షన్ల పరంగా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అది మిస్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ మొదటి వారంలోపే షూటింగ్ పూర్తి చేయాలి. ఆపై ప్రమోషన్ కు కనీసం 20 రోజులైనా అవసరం పడుతుంది. అయితే దర్శకుడు కొరటాల శివ దీన్ని ఎలా డీల్ చేస్తాడు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇందులో చిరంజీవి సహకారం కూడా చాలా అవసరం. 60 ఏళ్ళు పైబడిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న తరుణంలో సీనియర్ హీరోలు మునుపటి లాగా ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి లేదు. ఇదంతా ఇప్పటికైతే అయోమయంగానే ఉంది. ఒక్కసారి సెట్ లో సందళ్ళు మొదలయ్యాక ఒక్కో సినిమా గురించి స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఏది ఎలా ఉన్నా ఒకపక్క ఆర్ఆర్ఆర్ మరోపక్క ఆచార్య ఇలా డబుల్ ప్రెజర్ అయితే రామ్ చరణ్ మీద ఖచ్చితంగా ఉంటుంది.సో తనకు రాబోయే అయిదారు నెలలు కఠిన సవాళ్లుగానే నిలవబోతున్నాయి.

Show comments