వెళ్ళిపోయిందన్న ఏఐఐబి బ్యాంకు తిరిగి వచ్చింది – ఇది జగన్ విజయమే!

2019 ఎన్నికల అనంతరం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో అమరావతి పేరు మీద జరిగిన అవినీతి , దుబారా ఖర్చుపై సమీక్షలు నిర్వహించి కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని, రాష్ట్రంలో 12 జిల్లాలను పక్కకు నెట్టి రాష్ట్రమే అమరావతి అన్నట్టు వివిధ సంస్థల నుండి రుణాలు పొంది రాజధాని పేరిట అంతులేని అవినీతికి పాల్పడ్డారనే అభియోగం రావటంతో రుణం మంజూరు చేసిన సంస్థలు రాష్ట్రంలో అమరావతి కోసం రుణాల మంజూరు ప్రతిపాదన నుండి వెనక్కు తగ్గి మరొక ప్రతిపాదనతో రమ్మని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు.

ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం

అయితే చంద్రబాబుకు అనుకూల మీడియాలో అలాగే లోకేష్ కనుసన్నల్లో నడిచే తెలుగుదేశం సోషల్ మిడియా పేజీలలో, చంద్రబాబు ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి విదేశీ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని జగన్ పై ఆయన విధానాలపై నమ్మకం లేకే సంస్థలు వెనుతిరుగుతున్నాయని ప్రచారం అందుకున్నారు. ఆంద్రజ్యోతి పేపర్ అయితే ఏఐఐబీ సంస్థ జగన్ నిర్ణయాల వలన కలత చెంది ఏకంగా దేశానికే రాం రాం చెప్పేసినట్టు ఇదే విషయాన్ని ఆ సంస్థ కేంద్రానికి లేఖ ద్వార స్పష్టం చేసినట్టు, జగన్ నిర్ణయాలతో 1360 కోట్ల నిధులు ఆగిపోయాయని, ఇక అమరావతికి ఆక్సిజన్ బంద్ అయిపొయిందని ఇక రాష్ట్రం పురోగతి చెందటం కష్టతరమైన పని అని విచ్చలవిడిగా రాసేసింది. ఇక తెలుగుదేశం సోషల్ మీడియా వింగులైతే ఏకంగా జగన్ ప్రభుత్వం అసమర్ధత వలనే నేడు రాష్ట్రం నుండి సంస్థలు వెళ్లిపోతున్నాయనే పూర్తి అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం మొదలు పెట్టింది.

ఈ దుష్ప్రచారం పైన ఆనాడే స్పందించిన ప్రభుత్వం వివరణ ఇస్తూ ఏఐఐబీ సంస్థ అమరావతికి రుణం మంజూరు చెయ్యకపోవటానికి నాటి తెలుగుదేశం సర్కారులో జరిగిన అంతులేని అవినీతే అసలైన కారణమని, అయితే కొన్ని పత్రికలు, ఛానల్లు తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నట్టు రాష్ట్రం నుండే సంస్థ పూర్తిగా వెళ్ళిపోతునట్టు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఈ సంస్థ కేవలం అమరావతి ప్రాజెక్టుకు మాత్రమే రుణం మంజూరు చేయడం నుండి వెనక్కు తగ్గిందని, ఉపసంహరించుకున్న ఈ రుణాన్ని మరో కొత్త ప్రాజక్టుకు ఇవ్వడానికి ఏఐఐబీ ఆసక్తి కనబరుస్తుందని ఇప్పటికే ఆ విషయం బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియచేశారని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం చెప్పినట్లే తిరిగి వచ్చిన ఏఐఐబి

తెలుగుదేశం పార్టీ , వారి అనుకూల పత్రికలు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పడేలా తాజాగా నాడు ప్రభుత్వం చెప్పినట్టే ఏఐఐబీ బ్యాంకు తిరిగి రాష్ట్రానికి రుణం మంజూరు చేయడానికి ముందుకు వచ్చింది. అయితే గతంలో ప్రకటించినట్టుగా 1360 కోట్ల తో కాకుండా ఏకంగా 21,000 కోట్లు మంజూరు చేస్తునట్టు ప్రకటించింది. గురువారం నాడు సి.యం జగన్ తో భేటి అయిన బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇరిగేషన్ , రోడ్లు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు సహాయం చేయటానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం లాంటి సంక్షేమ పథకాలని ప్రశంసించారు. తదుపరి అంశాలపై చర్చించేందుకు ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావల్సిందిగా వై.యస్ జగన్ ను బ్యాంక్ ప్రెసిడెంట్ పాండ్యన్ ఆహ్వానించారు. దీంతో తెలుగుదేశం నేతలు, వారి అనుకూల పత్రికలు ఇన్నిరోజులు చేసింది దుష్ప్రచారమే అని తేలిపొయింది.

నిజానికి వాస్తవాలు ఇలా ఉంటే తెలుగుదేశం అనుకూల పత్రికలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల వార్తలను పూర్తిగా గాలికి వదిలి, కేవలం చంద్రబాబు కర పత్రంగానే అక్షరాలను అమ్ముకుంటున్నాయి. 2019 జులైలో రాష్ట్రం నుండి ఏఐఐబీ బ్యాంకు వెళ్లిపోతుందనే తప్పుడు వార్తను బ్యానర్ ఐటంగా తాటికాయంత అక్షరాలతో రాసిన ఆంధ్రజ్యోతి , నేడు అదే బ్యాంకు తిరిగి రెట్టింపు రుణాలతో రాష్ట్రానికి వస్తే 11వ పేజీలో ఆ వార్తను ఒక మూలన పడేసి, తిరిగి బ్యానర్ ఐటంగా విశాఖ నుండి ఐ.టి వెళ్ళిపోతోంది అని మరో తప్పుడు వార్తను వండి తాటికాయంత అక్షరాలతో వార్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం నేతలు, పత్రికలు, అనుబంధ సోషల్ మీడియా పనికట్టుకుని నిరంతరం ఒక ప్రణాళికా బద్దంగా దుష్ప్రచారం సాగిస్తున్నా ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. బ్యాంకు వెళ్ళిపోయిందని సాగిన ప్రచారాన్ని తిప్పికొడుతూ సదరు ఏఐఐబీ బ్యాంకు తిరిగి రాష్ట్రానికి రావడం మంచి పరిణామంగా చెప్పవచ్చు.

Show comments