పీఠాధిపతుల రహస్య సమావేశం అంటా !

ఆల‌యాల‌పై దాడులు ఎవ‌రికి ఉప‌యోగం.. ప్ర‌భుత్వానికా..? ప‌్ర‌తిప‌క్షానికా..? అని చిన్న‌ పిల్లాడిని అడిగినా స‌రైన స‌మాధానం చెబుతారు. దానికి తోడు ఆయా ఘ‌ట‌న‌ల‌లో ఎంద‌రో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఆధారాల‌తో స‌హా ప‌ట్టుబ‌డ్డారు. తాజాగా.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నాయకుల బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అచ్చెన్నాయుడుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు కార‌ణం ఆ కేసులో ప‌ట్టుబ‌డ్డ బ్యాచ్ విగ్రహం తరలింపు ముందు రోజు అచ్చెన్నాయుడిని కలిసినట్లు పోలీసులు నిర్థారించ‌డ‌మే.

ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రంలో జ‌రిగిన ఆల‌యాల‌పై దాడులు పీఠాధిప‌తుల‌ను కూడా విస్మ‌యానికి గురి చేశాయి. వారిలో కూడా అనుమానాలు రేకెత్తించాయి. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్‌ స్వామి స‌హా ప‌లువురు త‌మ సందేహాల‌ను గ‌తంలోనే వెలిబుచ్చారు. ఇంటెలిజెన్స్‌ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటామని గ‌తంలోనే చెప్పారు. దానిలో భాగంగానో.. మ‌రే ఇత‌ర కార‌ణాల‌తోనో తెలియ‌దు కానీ.. తాజాగా పీఠాధిప‌తులు స‌మావేశం అయ్యార‌న్న వార్త ప్ర‌చారంలో ఉంది. అధికారిక దృవీకరణ లేదు కాబట్టి ఆ సమావేశం జరిగిందో, లేదో కూడా తెలియదు. కానీ ఇక దొరికిందే త‌డ‌వుగా.. తెలుగుదేశం ఏం చేసినా.. అది లోక క‌ల్యాణం కోస‌మే.. వైసీపీ ఏం చేసినా అది విచ్ఛిన్నం కోస‌మే అన్న‌ట్లుగా వార్త‌ల‌ను వండి వ‌డ్డించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా పేరున్న ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మీడియాలో దీనిపై కూడా ఓ క‌థ‌నం అల్లేశారు. ఈ భేటీ ద్వారా జగన్ కు హెచ్చరిక లు తప్పవంటూ సెలవిచ్చారు.

పీఠాధిపతుల కీలక సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని, ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో పీఠాధిపతులు ర‌హ‌స్య‌ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అంటూనే స్వ‌యంగా ప‌రిశీలించిన‌ట్లు రిపోర్ట్ ఇచ్చారు. ” సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పెద్దలు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా ఉండేందుకు రహస్య ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఏపీలో ఆలయాలపై దాడులు, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సమావేశానికి దేశంలోని ముఖ్య పీఠాధిపతులు హాజరయ్యారని సమాచారం. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు మతమార్పిడులను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహంతో ఉన్న సంఘ్ పరివార్.. ఈ భేటీ ద్వారా హెచ్చరిక చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భేటీ సమాచారం తెలిసి పీఠాధిపతులతో మాట్లాడేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేత విఫలయత్నం చేశారని సమాచారం. ముఖ్య నేత సూచనతో ఓ మంత్రి రంగంలోకి దిగారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భేటీకి వెళ్లకుండా పీఠాధిపతులను నిలువరించేందుకు మంత్రి సంప్రదింపులు జరపగా.. అది విఫలమైనట్టు తెలుస్తోంది.” అని చెప్పుకొచ్చారు.

ఇక్క‌డ విశేషం ఏంటంటే.. దేవాల‌యాల దాడుల‌పై నిజంగా పీఠాధిప‌తులు స‌మావేశం కావాలంటే అది మీడియా ముఖంగానే జ‌రుగుతుంది. ఆ విష‌యం త్రిదండి చినజీయర్‌ స్వామి వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. లేదా స‌మావేశం త‌ర్వాత‌నైనా వివ‌రాలు వెల్ల‌డిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి హెచ్చరిక‌లో, సూచ‌న‌లో చేస్తారు. అలా కాకుండా ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా రహస్య ప్రదేశంలో స‌మావేశం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం పీఠాధిపతులకు ఏంటి? వారు ఏం చేసినా ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధి ఉంటుంది. అందువ‌ల్ల బ‌హిరంగంగానే వారు అనుకున్న‌ది చెబుతారు. చేయాల్సింది చేస్తారు. ఇంత చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యారు. అలా రాయ‌డంలో ఆంధ్ర‌జ్యోతి ఉద్దేశం ఏంటి.. అలా జరగాలని రాధాకృష్ణ ఆశనా లేక పంచాయితీ ఎన్నికల హడావిడి నేపధ్యంలో కొన్ని రోజులుగా ఏపీలో ఈ దాడుల తాలూకు అంశాలు పెద్దగా చర్చకు రావడం లేదు. అలా కనుమరుగు అయిపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉండదని భావించి ఇలా అద్భుత కల్పనకు శ్రీకారం చుట్టారా? ఆ రహస్యం రాధాకృష్ణకే తెలియాలి.

Show comments