iDreamPost
iDreamPost
ఎంతసేపు ప్రేమ పెళ్లి అనే రెండు కాన్సెప్టులతోనే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. వినూత్నంగా ఆలోచించినప్పుడు దానికి తగ్గట్టు కథలను తయారు చేసుకున్నప్పుడు కుటుంబ ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలబడి విజయాన్ని చేకూరుస్తారు. దానికో మంచి ఉదాహరణ ఆహ్వానం. 1997లో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో చాలా సీరియస్ ఇష్యూని డిస్కస్ చేశారు. మానవ సంబంధాలు మెకానికల్ గా మారిపోయి భార్యాభర్తలు విడిపోవడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్న తరుణంలో వివాహ బంధంలోని గొప్పదనాన్ని చాటి చెప్పేలా దీన్ని తీర్చిదిద్దిన తీరు అభినందనీయం.
నిజానికిది ఒరిజినల్ కథ కాదు. 1959లో అక్కినేని నాగేశ్వర్ రావు గారు నటించిన పెళ్లినాటి ప్రమాణాలు సినిమాకు రీమేక్ గా చెప్పొచ్చు. అప్పట్లో ఇది మంచి విజయం సాధించింది. భార్య పట్ల అయిష్టత పెంచుకున్న హీరో తన సెక్రటరీ వైపు ఆకర్షితుడై విడాకుల ద్వారా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటాడు. ఇతన్ని మార్చడం కోసం హీరోయిన్ కుటుంబం ఆడే డ్రామా రసవత్తరంగా మారి అతనిలో మార్పు వస్తుంది. దీన్ని ఇప్పటి తరానికి అర్థమయ్యేలా తీయాలనే ఉద్దేశంతో రచయిత దివాకర్ బాబుతో కలిసి ఆహ్వానం స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు కృష్ణారెడ్డి. రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్ గా రెండో కథానాయికగా హీరాను తీసుకుని తక్కువ బడ్జెట్ లో దీన్ని పూర్తి చేశారు.
ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో మాత్రమే సినిమాలు తీసిన నిర్మాత త్రివిక్రమరావు దీన్ని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కథ బాగా నచ్చిన ఆయన ఎక్కువ ఆలోచించలేదు. పెళ్లికి అందరికి పిలిచి వేడుక చేసుకున్నప్పుడు విడాకులకు సైతం అదే వేదిక ఉండాలని కోరుకున్న పాత్రలో రమ్యకృష్ణ ప్రదర్శించిన అద్భుత నటన మహిళా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. డబ్బాశకు కట్టుకున్న భార్యను వదిలేందుకు సైతం వెనుకాడని పాత్రలో శ్రీకాంత్ నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మ్యూజికల్ గానూ ఆహ్వానం పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు అరుదనే చెప్పాలి.