Dharani
Dharani
నెల మొత్తం కష్టపడితేనే మంత్ ఎండింగ్‌లో జీతం వస్తుంది. దాంతో మన ఆర్థిక అవసరాలు తీర్చుకుంటాం. అలా కాదని.. అసలు ఏం పని చేయకుండా కూర్చుని.. నెలకు లక్షలు లక్షలు రావాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. ఖాళీగా కూర్చుంటే.. చేతిలో ఉన్న రూపాయి కూడా ఖర్చవుతుంది తప్ప.. సంపాదన పావలా కూడా పెరగదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నం. అతడు ఏం పని చేయకపోయినా సరే.. ప్రతి నెలా అతడిఖాతాలో ఐదున్నర లక్షల రూపాలు జమ అవుతాయి. అది కూడా నెలో, రెండు నెలలో, ఏడాదో అనుకుంటే పొరపాటు… ఏకంగా 25 ఏళ్ల పాటు ప్రతి నెల అతడి ఖాతాలో 5.5 లక్షల రూపాయలు జమ అవుతాయి. వామ్మో ఎవరా అదృష్టవంతుడు.. ఎందుకు అతడికి ఆ బంపరాఫర్ అనుకుంటున్నారా.. అయితే చదవండి..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ‘ఫాస్ట్ 5’(FAST 5) పేరిట నిర్వహించిన మొదటి లాటరీలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇంతటి భారీ అదృష్టం వరించింది. దాంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే.. అతడే యూపీకి చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్. గత కొన్నాళ్లుగా దుబాయ్‌లోని ఒక రియల్‌ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూఏఈలో ‘ఫాస్ట్ 5’ పేరిట నిర్వహించే లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు ఖాన్. ఏదో సరదాగా టికెట్ కొన్నాడు కానీ నిజంగానే తనకు ఇలాంటి అదృష్టం వస్తుంది అతడు ఏమాత్రం ఊహిచలేదు.
కానీ మనకు రావాలి అని ఉంది తప్పకుండా వచ్చి తీరుతంది. అలానే ఈ అదృష్టం ఖాన్‌కి రాసి పెట్టి ఉంది. దాంతో ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో ఖాన్.. మెగా ప్రైజ్ మనీ విజేతగా నిలిచినట్టు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఆ లాటరీ నిబంధనల ప్రకారం మొదటి విజేతకు ప్రతి నెలా 25,000 దిర్హమ్‌లు (భారతీయ కరెన్సీలో రూ.5,59,822) చొప్పున 25 ఏళ్లపాటు అందజేయనున్నారు. తనను వరించిన ఈ అదృష్టాన్ని చూసి ఆదిల్ ఖాన్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని.. తనకు జీవితంలో అత్యంత ముఖ్యమైన అవసరమైన సమయంలో ఇంత భారీ మొత్త డబ్బులు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ..‘‘ఫాస్ట్ 5 డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.. చాలా కీలక సమయంలో డబ్బులు రాబోతున్నాయి. నా కుటుంబం మొత్తానికి నేనే ఏకైక జీవనాధారం. కరోనా సమయంలో నా సోదరుడు చనిపోయాడు.. దాంతో అతడి కుటుంబ బాధ్యతలు కూడా నా మీదే పడ్డాయి. అంతేకాక నాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల కుమార్తె ఉంది. వీరందరిని పోషించడానికి నాకు అదనపు ఆదాయం ఎంతో ముఖ్యం. ఇంత కీలక సమయంలో నాకు లాటరీ వచ్చింది. పైగా 25 ఏళ్ల పాటు ప్రతి నెలా 5.5 లక్షల ఆదాయం పొందబోతున్నాను అంటే.. సంతోషంతో అస్సలు మాటలు రావడం లేదు. నేను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు మా కుటుంబసభ్యులు ముందు నమ్మలేదు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని సలహా ఇచ్చారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతునున్నాను’’ అని ఆదిల్ ఖాన్ చెప్పాడు.