Naga Panchami Festival: నాగుల పంచమి: భక్తా.. ధైర్యమా.. ఇంట్లో నిజంగానే పాముకు పూజ

నాగుల పంచమి: భక్తా.. ధైర్యమా.. ఇంట్లో నిజంగానే పాముకు పూజ

ప్రకృతిని కూడా పూజించే గొప్ప గుణం భారతీయులకు మాత్రమే ఉంది. గుడికి వెళ్లి పూజ చేయడమే కాదు.. ప్రకృతి ఒడిలో ఉన్న చెట్లు, పుట్టలు, రాళ్లకు కూడా పూజలు చేసి.. భక్తిని చాటుకుంటారు. మూఢనమ్మకం అని కొందరంటే.. మనల్ని చల్లగా చూసే ప్రకృతి పట్ల మా కృతజ్ఞతను ఇలా తెలుపుకుంటున్నాం.. ఇందులో తప్పేం ఉందని మరి కొందరు వాదిస్తారు. అలానే పామును దేవతగా కొలిచే సంస్కతి కూడా కేవలం మన దగ్గర మాత్రమే కనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. పాములను పూజించడం కోసం ప్రతి ఏటా నాగ పంచమి పేరిటి పండుగ చేసుకుంటాం. ఆరోజు మహిళలు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి.. పూజలు చేసి వస్తారు. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..

నాగుల పంచమి పర్వదినం నాడు.. సాధారణంగా పుట్ట ఉన్న చోటుకి వెళ్లి.. నాగేంద్రుడికి పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి.. తమ మనసులోని కోరికలు కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కుటుంబం మాత్రం ఇందుకు భిన్నంగా.. ఏకంగా ఇంట్లోనే.. నిజంగా పాముకు పూజ చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసికి చెందిన ప్రశాంత్‌ హులేకల్‌.. ఇంట్లోనే.. నిజంగా పాముకి పూజ చేసి తమ భక్తిని చాటుకున్నారు.

అయితే వీరు ప్రతి ఏటా నాగ పంచమి రోజున ఇలానే నిజం పాముకి.. ఇంట్లోనే పూజ చేస్తారు. నాగ పంచమి రోజున చిన్న పాము పిల్లను తీసుకు వచ్చి.. పూజ గదిలో ఒక పల్లెంలో ఉంచి.. దానికి పాలు పట్టించి.. పూజ చేసి ఆ తర్వాత అడవిలో విడిచి పెట్టి వస్తారు. మరి వారికి భయం వేయదా అంటే లేదు అంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్.. ఇళ్లలోకి వచ్చే పాములని పట్టి అడవులో వదిలేసి వస్తుంటానని తెలిపాడు. అంతేకాక పాములకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వివరిస్తూ ఉంటాడు. పైగా ప్రతి ఏటా.. నాగ పంచమి రోజున పామును ఇంటికి తీసుకువచ్చి ఇలా పూజలు నిర్వహించి.. వాటిపై తన ప్రేమను చాటుకుంటున్నాడు.

Show comments