సీమా గులామ్ హైదర్.. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు. ఆన్లైన్ లవర్ కోసం ఏకంగా పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తన నలుగురు పిల్లల్ని వెంటేసుకొని మరీ వచ్చేసింది. ఆమె భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇండియా వీసా కోసం ప్రయత్నించిన ఒక పాక్ యువతి.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని వర్చువల్‌గా వివాహం చేసుకుంది. జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు.. కరాచీకి చెందిన అమీనా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే వారి వివాహం భారత్‌లో చేయాలని పెద్దలు నిర్ణయించారు.
ఇండియాకు రావాలంటే అవసరమైన వీసా కోసం అమీనా తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకు అనుమతి రాలేదు. దీంతో ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం బుధవారం వర్చువల్‌గా వీళ్లకు నిఖా జరిపించారు పెద్దలు. ఈ విషయంపై అర్బాజ్ స్పందిస్తూ.. వీసా కోసం అమీనా దరఖాస్తు చేసుకుందని తెలిపాడు. తాను పాకిస్థాన్‌కు వెళ్లి పెళ్లి చేసుకోలేనని, ఎందుకంటే దానికి గుర్తింపు ఉండదన్నాడు. ఆమె భారత్‌కు వచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటానని అర్బాజ్ చెప్పుకొచ్చాడు. జోధ్‌పూర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌కు సన్నిహితులు, బంధుమిత్రులతో కలసి చేరుకున్న అర్బాజ్.. అమీనాను వర్చువల్‌గా నిఖా చేసుకున్నాడు.
అర్బాజ్ కుటుంబం అతడికి నిఖా చేయడమే గాక సంప్రదాయబద్ధంగా జరగాల్సిన అన్ని వేడుకలు జరిపింది. ఈ వివాహం జోధ్‌పూర్ ఖాజీ ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది. నూతన దంపతులను ఖాజీ ఆశీర్వదించారు. అమీనాతో నిఖా గురించి అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నాడు. పాక్‌లోని తమ బంధువుల ద్వారా ఈ సంబంధం కుదిరిందని తెలిపాడు. తమ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశారన్నాడు. ఆన్లైన్లో పెళ్లి చేసుకోవడానికి భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటం కారణమన్నాడు అర్బాజ్. అయితే వీళ్ల వివాహమైతే జరిగింది. కానీ వీసా రాకపోతే వధువు భారత్‌కు రావడం కుదరదు.