Chiranjeevi: కష్టపడకుండా డబ్బులు తీసుకోలేను! చిరంజీవి సెటైర్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు అంటే.. ఏమాత్రం ఆలోచించుకోకుండా చెప్పే పేరు మెగాస్టార్ చింజీవి. ఒక్కడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఇప్పటికీ స్వయంకృషి అంటే ఆయనే పేరే చెబుతారు. మెగాస్టార్ ఎప్పుడూ నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ డూప్ లేకుండా డాన్సులు, ఫైటులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు ఇంత కష్టం పడతారు అని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అయినవాళ్లు, తెలిసిన వాళ్లు అడుగుతూనే ఉంటారు. అలాంటి ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెప్పారు.

ఇండస్ట్రీలో తాను ఒక్కడే ఎదగడం కాకుండా.. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో చిరంజీవి ముందుంటారు. అలాగే తనతో కలిసి ప్రయాణం చేసిన వారిని కూడా ప్రతి స్పెషల్ అకేషన్ లో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. వారికి ఏ అవసరం వచ్చినా కూడా ముందుడి నడిపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదాలను వాడను అని చెప్పుకొచ్చారు. అయితే తాను ఎలాంటి పుస్తకాలు చదవలేదని.. జొన్నవిత్తుల, జంధ్యాల లాంటి వారితో కూర్చుని ఉన్నప్పుడు మాట్లాడే సందర్భంలో విన్న మాటలు అలా తన మనసు నిక్షిప్తమైపోతాయని చెప్పుకొచ్చారు. చాలామంది ఎందుకు అంత కఠినమైన పదాలు మాట్లాడతారు? సింపుల్ గా ఇంగ్లీష్ పదాలు మాట్లాడవచ్చు కదా అని అంటారట. అయితే ఇంగ్లీష్ పదాలను వాడకుండా ఉండేందుకే ప్రయత్నిస్తానన్నారు.

అలాగే కష్టపడటం ఆప కూడదు అనే విషయంపై కూడా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. “నేను అనుకుంటూ ఉంటా. నేను ఇంకా ఎన్నాళ్లు డాన్సులు చేయాలి. ఎన్నాళ్లు ఫైటులు చేయాలి? రీరికార్డింగ్ తో భమ్ అని మన హీరోయిజాన్ని లేపేస్తే.. హాయిగా వెళ్లామా షూటింగ్ కి మేకప్ తుడిచేశామా.. నిర్మాత దగ్గర డబ్బులు తీసుకున్నామా.. ఎంత బాగుంటుంది. అలాంటి పరిస్థితి కాదు మనది. మనం ఆడాలి, ఒరిజినల్ గా ఫైటులు చేయాలి, ఒళ్లు హూనం చేసుకోవాలి. అప్పుడు గానీ ప్రొడ్యూసర్లకు తృప్తి ఉండదు.. ఆడియన్స్ కి తృప్తి ఉండదు.. మాకు తృప్తి ఉండదు” అంటూ చెప్పుకొచ్చారు. కష్టం పడటం ఆప కూడదు అని నొక్కి చెప్పారు. అయితే మెగాస్టార్ వేసిన ఈ సైటైర్స్ ఎవరి మీద అనే చర్చ నడుస్తోంది.

Show comments