2 సినిమాలు – 1500 కోట్లు

2 సినిమాలు – 1500 కోట్లు

  • Published - 02:25 PM, Thu - 10 November 22
2 సినిమాలు – 1500 కోట్లు

అగ్ర నిర్మాణ సంస్థలే పెద్ద బడ్జెట్ లను భారంగా భావిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న క్రమంలో కంటెంట్ ను నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో హోంబాలే ఫిలిమ్స్ చూపిస్తోంది. చాలా పరిమితంగా ఉండే కన్నడ మార్కెట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్న ఘనత దీనికే దక్కుతుంది. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్ బస్టర్స్ తో ఏకంగా పదిహేను వందల కోట్ల మార్కుని సాధించడం తలలు పండిన బాలీవుడ్ బ్యానర్ల వల్లే కాలేదు. యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న యష్ రాజ్ కంపెనీ కేవలం మూడు నెలల వ్యవధిలో పోగొట్టుకున్న సొమ్ము మూడు వందల కోట్ల పైమాటే. అంత లెజెండరీ సంస్థకు సైతం డిజాస్టర్ల వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది.

ఇక హోంబాలే విషయానికి వస్తే దీనికి మరీ సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద చరిత్ర లేదు. 2014లో పునీత్ రాజ్ కుమార్ నిన్నిందలేతో దీని ప్రస్థానం మొదలయ్యింది. మన జయంత్ సి పరాంజీనే దర్శకుడు. తర్వాత యష్ తో తీసిన మాస్టర్ పీస్ పెద్ద హిట్టు. 2017లో తిరిగి పునీత్ తోనే చేసిన రాజకుమార ఘనవిజయం సాధించింది. ఆ టైంలోనే ఉగ్రం చూసి ప్రశాంత్ నీల్ కి అవకాశమిచ్చి కెజిఎఫ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పునీత్ తోనే మూడో చిత్రం యువరత్నని నిర్మించడం తెలిసిందే. కెజిఎఫ్ ఇచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ రెండో భాగం మీద అంచనాలు అమాంతం పెంచేసి ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లతో నెంబర్ వన్ గా నిలిచింది.

ఇప్పుడు కాంతార 350 కోట్లతో శాండల్ వుడ్ నెంబర్ టూగా కొనసాగుతూ మొదటి స్థానానికి పరుగులు పెడుతోంది. రెగ్యులర్ కమర్షియల్ కథల జోలికి వెళ్లకపోవడమే హోంబాలే ప్రత్యేకత. అందుకే అతి తక్కువ టైంలో ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సలార్, టైసన్, బగీరా, రిచర్డ్ ఆంటోనీ, ధూమం దేనికవే డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగితే ఏడాదికి కనీసం రెండు వేల టర్నోవర్ సాధిస్తున్న బ్యానర్ గా హోంబాలే అరుదైన రికార్డు సాధిస్తుంది. శుక్రమహర్దశ అంటే బహుశా ఇదేనేమో. నేటివిటీ రిస్కు చాలా ఉన్న కాంతార అద్భుత విజయాన్ని బట్టే చెప్పొచ్చు వీళ్ళ కథల ఎంపిక ఎంత వైవిధ్యంగా ఉందో.

Show comments