ఇన్‌స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం వెళ్లి చివరకు..

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని బాలికను కడతేర్చిన ప్రియుడు. ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడి అంతమొందించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని బాలికను కడతేర్చిన ప్రియుడు. ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడి అంతమొందించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. అమ్మాయిలను ఇన్ స్టాలో పరిచయం చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు పోకిరీలు. మరికొందరు ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని ఆ తర్వాత చాటింగ్, కాల్స్ తో ముగ్గులోకి దింపుతున్నారు. కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రియుడిని నమ్మి వెళితే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇదే తరహాలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ టీఎన్‌నగర్‌కు చెందిన దంపతుల కుమార్తె(17) ఇంటర్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్‌ వాయించే విఘ్నేశ్‌ అలియాస్‌ చింటూ(22)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఈ క్రమంలో బాలిక తనను పెళ్లి చేసుకోవాలని చింటూపై ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో బాలిక అక్టోబరు 20న ఇల్లు వదిలి ప్రియుడు ఉండే ఉప్పుగూడ వెళ్లింది. ఆ తర్వాత చింటూ ఆ బాలికను ఛత్రినాకలో ఉండే సాకేత్ ఇంటికి తీసుకెళ్లాడు. కాగా సాకేత్ కు వివాహం జరిగింది. సాకేత్ ఇంట్లో నలుగురు ఉండడానికి వీలుపడకపోయే సరికి మీర్ పేటకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇదే విషయాన్ని మైనర్ బాలిక తల్లి, సోదరికి ఫోన్ చేసి తెలిపింది. అయితే చింటూ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని బాలిక చింటూపై ఒత్తిడి తెచ్చింది.

దీంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. కాగా మైనర్ బాలిక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి చింటూ తప్పించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో బాలిక ఇన్ స్టాలో మరొకరితో మాట్లాడుతుందని చింటూ అనుమానించసాగాడు. ఇదే విషయంపై గొడవ జరగగా బాలిక గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం సాకేత్ అతని భార్య సాయంతో బాలిక మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్ళి శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో పడేశాడు. ఎవరికీ కనిపించకుండా చెత్తతో కప్పి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత చింటూ బాలిక పేరెంట్స్ కు ఫోన్ చేసి మీ కూతురు తన వద్ద లేదని, ఫోన్ పనిచేయడం లేదని మీ ఇంటికి వచ్చిందా అని అడిగారు. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.

అంతకు ముందు బాలిక తల్లితో తరచూ ఫోన్ లో మాట్లాడేది. కానీ ఉన్నట్టుండి ఈ నెల 8 నుంచి బాలిక నుంచి ఫోన్ కాల్స్ ఏం రావట్లేదని తల్లి గుర్తించింది. రోజులు గడుస్తున్నా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 10న మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింటూపై అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చింటూను విచారణకు పిలవగా వస్తున్నానని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చింటూను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు సహకరించిన స్నేహితుడు, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రియుడి కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన బాలిక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments