పాపం.. పని కావాలని అడిగిందని మహిళపై..

ఈ మధ్య కాలంలో మహిళలపై అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి. బాధ్యత కలిగిన పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, పని అడిగిందని ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు ఊరి సర్పంచ్‌. ఈ సంఘటన కర్ణాటకలోని యాదగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని యాదగిరి తాలూకాలోని యరగోళ గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తోంది.

గత కొద్దిరోజులుగా ఆమెకు ఎక్కడా కూలీ పనులు దొరకలేదు. దీంతో గ్రామ సర్పంచ్‌ అల్లీపుర రామప్ప దగ్గరకు ఆమె వెళ్లింది. నరేగ ఆయబ్‌ పథకం కింద తనకు పని కల్పించాలని కోరింది. దీంతో సర్పంచ్‌ రామప్పతో పాటు శివప్ప, ఆయన కుమారుడు నింగప్ప పద్మావతిపై దాడి చేశారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. వారి దాడిలో గాయపడ్డ ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments