అమెరికా వెళ్లి వచ్చిన గవర్నమెంట్‌ స్కూల్‌ విద్యార్థులతో సీఎం భేటీ!

అమెరికాలో పర్యటించి వచ్చిన ఏపీ ప్రభుత్వ విద్యార్థుల బృందం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పరిచయం చేసుకున్నారు. అమెరికా పర్యటన ఎలా జరిగిందని పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం జగన్‌ స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. వారిలో ఉత్తేజాన్ని నింపుతూ ఉత్తమ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు.

‘‘ అమెరికా పర్యటన ద్వారా.. గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాంమీదకు వెళ్లడానికి ఆ అనుభవాలు ఉపయోగపడతాయి. ప్రపంచస్థాయికి ఎదగాలన్న కోరిక మీకు మరింత గట్టిపడుతుంది. ఈ పర్యటన మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనకబడి ఉన్నాం? మనకు అర్థం అవుతుంది. ప్రపంచంతో మనం పోటీపడాలి, మనం నిలబడగలగాలి. మనం జగనన్న విదేశీ దీవెన అమలు చేస్తున్నాం. కొలంబియా యూనివర్శిటీ, వార్టన్‌, ఎల్‌ఎస్‌ఈ, ఇన్సియార్డ్‌.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నదానిపై విజన్‌ పెట్టుకోవాలి.

ఇలాంటి కాలేజీలు 350 ఉన్నాయి. వీటిలో సీటు సాధించడం అన్నది మీ విజన్‌ కావాలి, మీ లక్ష్యం కావాలి. అక్కడనుంచి మీరు ఎప్పుడైతే విద్యను అభ్యసించి బయటకు వస్తారో.. మీ బతుకులు మారడమే కాదు.. మీ కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రతిష్ట కూడా పెరుగుతుంది. దేవుడి దయవల్ల పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద హోదాల్లో మీరు పనిచేయగలిగితే… మీలాంటి పదిమంది పిల్లలకు మీరు సహాయపడతారు. వారికి చేదోడుగా నిలుస్తారు’’ అని అన్నారు.

Show comments