IMD Rain Alert To TS&AP: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అల్ప పీడనం బలపడిందని.. దీని ప్రభావంగా.. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్‌లో అయితే గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడనం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతారణశాఖ అధికారులు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచలనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు..

అల్ప పీడనం కారణంగా ఏపీలో మరో నాలుగు రోజుల పాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక అల్పపీడనం కారణంగా గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది.

Show comments