బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురిసాయి. ఈ వారం ప్రారంభం నుంచి వానలకు కాస్త బ్రేక్‌ పడింది. ఇక వానలు తిరుగుముఖం పడుతాయని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరోగమన సమయం దగ్గర పడుతుండటంతో.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని.. ఫలితంగా ఈ నెలాఖరువరకు జోరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ 21 వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్‌ 22-28 వ తారీకు వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

అల్పపీడనం కారణంగా.. తెలంగాణలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఇదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

అల్ప పీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. అంతేకాక వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలుకు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అల్పపీడనం వల్ల గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఈ నెలలోనే కాకుండా అక్టోబర్‌ 5, 6వ తేదీల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్టోబర్‌ 6 నుంచి 12వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలపిఇంది. అల్పపీడనం కారణంగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణవాఖ శుభవార్త చెప్పింది.

Show comments