Heavy Rains: విజయవాడలో మళ్లీ భారీ వర్షం.. భయంతో వణికిపోతున్న నగర వాసులు

Heavy Rains-Vijayawada: మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో వరదలో చిక్కుకుపోయిన విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఆ వివరాలు..

Heavy Rains-Vijayawada: మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో వరదలో చిక్కుకుపోయిన విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం.. భారీ వర్షాలు, వరదలతో అత్యంత భయంకర పరిస్థితులను చవి చూశాయి. రెండు రోజుల నుంచి వరద కాస్త తగ్గినా.. పరిస్థితి మాత్రం ఇంకా చక్కడలేదు. ఇక వియజవాడ విషయానికి వస్తే..భారీ వర్షాలతో బెజవాడ గజగజలాడింది. 50ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చి బీభత్సం సృష్టించింది. బుడమేరు పరిసర గ్రామాలన్నీ జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.

వరద ప్రభావం నుంచి ఇప్పిడిప్పుడే కాస్త కోలుకుంటున్న విజయవాడను మరో సారి కురుస్తున్న భారీ వర్షాలు భయపెడుతున్నాయి. మొన్నటి వరద ప్రభావం నుంచి ఇంకా కోలుకోనేలేదు. కానీ ఈలోపే బుధవారం అర్థరాత్రి నుంచి నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. ఊరుములు, మెరుపులతో కూడిన వాన.. నగరవాసులను వణికిస్తుంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఐదు రోజులుగా జల దిగ్భందంలోనే ఉన్న విజయవాడ వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే నగరంలో వరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క మాత్రం తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా అనేక ప్రాంతాల్లో డెడ్ బాడీలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. వీటిల్లో 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. వరద పూర్తిగా తగ్గేలోపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఫలితంగా సెప్టెంబర్ 9వరకు వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Show comments