Dharani
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కార్.. తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కార్.. తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు కేటగిరీల ప్రకారం ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయకముందే అనగా 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు.. ప్రమోషన్ల విషయంలో గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ సంస్థ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించి.. కొన్ని నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే వర్తింపజేశారు.
దీని వల్ల కొందరు నష్టపోయే అవకాశం ఉంది. అంటే గతంలో అనగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు.. తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. ప్రస్తుతం పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.
తాజా నిర్ణయం వల్ల 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఈ కేటగిరీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.