Pawan Decision In Vishaka Seats: పవన్‌ ఏకపక్ష నిర్ణయం.. ఇక కూటమిలో చీలికలేనా?

పవన్‌ ఏకపక్ష నిర్ణయం.. ఇక కూటమిలో చీలికలేనా?

పవన్‌ కళ్యాణ్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. ఆ వివరాలు..

పవన్‌ కళ్యాణ్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. ఆ వివరాలు..

రానున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది కానీ సీట్ల పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి ప్రకటన చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు, పవన్‌ తీరు చూస్తే మాత్రం కేడర్‌లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. అభ్యర్థుల గురించి ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటన చేయాల్సింది పోయి.. ఎవరికి నచ్చినట్లు వారు ప్రకటిస్తూ.. కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నారు. ఇక తాజాగా పవన్‌ తీసుకున్న నిర్ణయంతో కూటమిలో చీలికలు రావడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు ఏం జరిగింది అంటే..

గతంలో పవన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని.. అందుకే తాను కూడా అదే మార్గంలో వెళ్లాల్సి వస్తుందని చెప్పి.. జనవరి 26 నాడు ఆయన కూడా జనసేన పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాల పేర్లు ప్రకటించాడు. ఆ అంశం వివాదాస్పదమైంది. అది సద్దుమణగిలోపే మళ్లీ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుని.. టీడీపీకి భారీ షాక్‌ ఇచ్చాడు పవన్‌ కళ్యాణ్‌. ఇప్పటికే గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్‌.. రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు.

ఇక తాజాగా రాజమండ్రి రూరల్‌లో తమ అభ్యర్థి కందుల దుర్గేష్‌కు టికెట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాంతో అక్కడ టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, ఆరుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తాము అన్నారు.. రాజమండ్రి రూరల్‌ టికెట్‌ నాది.. దీనిపై ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు అన్నారు. పవన్‌ ప్రకటన తర్వాత రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక కొన్ని రోజుల క్రితం విశాఖలో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌.. తన అన్నయ్య నాగబాబుతోబాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించి.. జనసేన పోటీ చేయబోయే నాలుగు స్థానాలు ప్రకటించారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారని.. టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్‌ను, యలమంచిలికి సుందరపు విజయ్ కుమార్‌ను ఇన్‌ఛార్జీలుగా ప్రకటించేశారు పవన్‌. ఇదిలా ఉంటే.. ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదంటూ ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కచ్చితంగా ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది అంటున్నారు.

విశాఖలో పవన్‌ నాలుగు స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీతో పొత్తులో ఉండి.. ఆ పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఏకంగా నలుగురికి దాదాపు టికెట్లు కన్ఫామ్‌ చేయడం వెనక పవన్‌ ఆంతర్యం ఏంటి.. చంద్రబాబు అనుమతితో తనకు సంబంధం లేదని.. లేక ఇదంతా బాబు అనుమతితోనే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక ఆయా నియోజకవర్గాల్లో టీడీపీనే నమ్ముకుని.. ఐదేళ్లుగా పని చేస్తున్న కేడర్‌ పవన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు.

అంతేకాక పవన్‌ ఏకపక్ష నిర్ణయాలపై తెలుగుదేశం అధిష్టానం, చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే టికెట్ల గురించి ప్రకటించారా.. లేక ఇది ఆయన సొంత నిర్ణయమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పవన్‌ సొంత నిర్ణయమే అయితే కూటమిలో చీలికలు రావడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పవన్‌ నిర్ణయాలపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments