చరణ్ కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్

చరణ్ కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్వంత బ్యానర్ లో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్న చిరు 152లో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా తన సినిమా హీరో సెట్స్ లో ఉండగా ఇంకొకరికి అప్పజెప్పేందుకు ససేమిరా ఇష్టపడని జక్కన్న ఫైనల్ గా చరణ్ కు ఆకుపచ్చ జెండా ఊపినట్టు తెలిసింది.

ప్రస్తుతానికి చరణ్ పాత్రకు సంబంధించి ఆర్ఆర్ఆర్ లో 25 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందట. అయితే ఇతర పాత్రలతో కాంబినేషన్ సీన్లు ఉంటాయి కాబట్టి అవి వరుసగా చేయడం సాధ్య పడదు. అందులోనూ చెర్రీ జోడి అలియా భట్ ఇంకా సెట్స్ లోకి రానేలేదు. కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం సెట్ చేసుకుని జూన్ లో చరణ్ తారక్ ల మీద షూట్ చేసే ప్రమోషనల్ సాంగ్ తో గుమ్మడికాయ కొట్టే విధంగా స్కెచ్ రెడీ చేశారట ఈ మధ్యలో వచ్చే గ్యాప్ లో కొరటాల శివ షూటింగ్ కు హాజరు కావొచ్చనే హామీ జక్కన్న నుంచి రావడంతో చరణ్ ఆమేరకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఇది అధికారికంగా వెల్లడించనప్పటికీ వ్యవహారం చక్కబడిపోయిందని వార్త. బాహుబలి టైంలోనూ ప్రభాస్ ను ఇతర సినిమాలకు కమిట్ కాకుండా జాగ్రత్త వహించిన రాజమౌళి ఇప్పుడీ ఇద్దరు స్టార్స్ తోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. కాకపోతే అనుకున్న టైం కన్నా ఆరు నెలలు ఆలస్యం కావడంతో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టు తెలిసింది. మరి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన అప్ డేట్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి తక్కువ గ్యాప్ లోనే చరణ్ ని రెండు సినిమాల్లో చూసే ఛాన్స్ ని ఫ్యాన్స్ పొందుతారన్న మాట.

Show comments