ప్రభుత్వానికి మరోసారి డెడ్‌లైన్‌ విధించిన పవన్‌

ప్రభుత్వానికి మరోసారి డెడ్‌లైన్‌ విధించిన పవన్‌

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, 217 జీవోలపై గతంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్‌లు విధించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాజాగా కౌలురైతుల సమస్యల పరిష్కారంపై మరోసారి గడువు ప్రకటించారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబాలకు నెలరోజుల్లో ప్రభుత్వం న్యాయం చేయకుంటే పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన కౌలు రైతుల కోసం పోరాడాలని పవన్‌కళ్యాణ్‌ బలమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఈసారి నెల తర్వాత కాల్షీట్‌ ఫిక్స్‌ చేశారా?

20 రోజులకో, నెలకో ఒకసారి ప్రజాసమస్యలపై పబ్లిక్‌లోకి వస్తున్న పవన్‌ కల్యాణ్‌ ముందుగా నాదెండ్ల మనోహర్‌ను రంగంలోకి దింపుతుంటారు. ఎంచుకున్న సమస్యపై ఆయన అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఒక ప్రెస్‌మీట్‌ పెడతారు. ఫలానా తేదీన పవన్‌ ఆ సమస్యపై పోరాడటానికి వస్తున్నారహో అని ప్రకటన ఇస్తారు.మనోహర్‌ చెప్పినట్టుగానే షెడ్యూల్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ బయటకు వస్తారు. తానిచ్చిన కాల్షీట్‌ ప్రకారం కొన్ని గంటలపాటు సన్నివేశాన్ని రక్తి కట్టిస్తారు. సినిమాటిక్‌ గా ఆవేశపడుతూ ప్రసంగించి అభిమానులను అలరిస్తారు.రాష్ట్ర ప్రభుత్వంపై,ముఖ్యమంత్రి, మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత గడువు ఇస్తారు. ఆ టైమ్‌లోపు ప్రభుత్వం స్పందించకపోతే తాను స్వయంగా రంగంలోకి దిగి పోరాడతానని ఒక అల్టిమేటమ్‌ లాంటిది ఇస్తారు. అంతే సీన్‌ కట్‌ చేస్తే మరో సమస్యపై 20 రోజులకో, నెలకో మళ్లీ మనోహర్‌ రంగం సిద్ధం చేస్తుంటారు.

ఏ సమస్యపై తుదికంటా పోరాడారట!

ప్రజా సమస్యల పరిష్కారంపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పోరాటం ఒక ఫార్స్‌గా ఉంటోందని రాజకీయ విమర్శకులు అంటుంటారు. గతంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటాను,10 రోజుల్లోగా ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అని డెడ్‌లైన్‌ విధించారు. ఈయన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోయినా పవన్‌ ఆ సమస్యపై ఇప్పటి వరకు మళ్లీ పెదవి విప్పలేదు. రాష్ట్రంలో రోడ్డ సమస్య, 217 జీవోపై కూడా డెడ్‌లైన్లు విధించారు. ఆ తర్వాత ఆ సమస్యలను ప్రభుత్వం ఎంతవరకు పరిష్కరించింది? అన్నది పట్టించుకోలేదు. ఆసలు వాటి ప్రస్తావనే ఇప్పటి వరకు తీసుకురాలేదు. మళ్లీ ఇప్పుడు కౌలురైతుల సమస్యలపై పవన్‌ పోరాడతారు అంటూ మనోహర్‌ ప్రకటించారు.దేనిపైనా తుదికంటా పోరాడకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని పవన్‌ భావిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డిమాండ్లు సరే చిత్తశుద్ధి ఏది?

ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబానికి రూ.7లక్షలు పరిహారంగా అందించాలని, అప్పులను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలని, వారి బిడ్డలను చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మనోహర్‌ డిమాండ్‌ చేశారు. అయితే కౌలు రైతుల భద్రతకు ప్రభుత్వం చేసిన చట్టం లోపభూయిష్టమని విమర్శిస్తున్న మనోహర్‌ తమ పార్టీ తరపున ఇంకా మెరుగ్గా ఆ చట్టం ఎలా అమలు చేయవచ్చో చెప్పలేదు. ఎంతసేపూ ప్రభుత్వాన్ని విమర్శించడం, డెడ్‌లైన్లు విధించడమే తప్ప పార్టీ తరపున సూచనలు ఎప్పుడైనా ఇచ్చారా? సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడకుండా ప్రజల దృష్టిలో పడడానికి అన్నట్టు రెగ్యులర్‌ ఇంటర్‌ వెల్స్‌లో షో చేస్తే జనం ఆదరిస్తారా?అన్నది జనసేన నాయకులు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ తన పార్టీకి ఉన్న ఏడుశాతం ఓటు బ్యాంకు జారిపోకుండా ఉండాలంటే నిత్యం జనం మధ్యన ఉండాలి. అలాకాకుండా నాయకులను, కార్యకర్తలను ముందుకు పంపి జనసేనాని వెనకాల రావడం. అది కూడా అప్పుడప్పుడూ కావడం పార్టీ బలపడడానికి దోహదపడుతుందా? అన్నది ఆలోచించుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Show comments