IMD Rain Alert Telangana & AP: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

రెండు రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెల ప్రాంరభంలో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యి.. జనాలను బెంబేలెత్తించాయి. ఇదే పంథా కొనసాగితే.. మరో నెల రోజుల పాటు ఈ వేడిని తట్టుకుని బతకడం కష్టం అని భయపడ్డారు. ఎండ వేడికి తోడు.. వడగాడ్పులు వీచడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు జనాలు. ఉదయం 8 గంటల నుంచే వేడి తీవ్రత పెరిగింది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇదే కొనసాగింది. దాంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని.. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచించారు.

ఇలా ఉండగా.. మంగళవారం నాడు వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉన్నట్లుండి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. ఇన్నాళ్లు ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనాలు.. తాజాగా కురిసిన జోరు వానతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే జోరు వాన వల్ల వాతావరణం చల్ల బడింది కానీ.. చాలా చోట్ల అకాల వర్షం కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భారీ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. నేడు ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం నాడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని.. సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, బుధవారం సాయంత్రం కూడా పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

తెలంగాణలో ఇలా ఉండగా.. ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జోరు వానలు కురుస్తున్నాయి. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు రోజులు (గురు, శుక్రవారం) పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనివాతావరణ శౠఖ వెల్లడించింది. అంతేకాక చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వానలకు అవకాశం ఉందని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Show comments