ఆంధ్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినరోజు

ఆంధ్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినరోజు

సరిగ్గా యేడాది క్రితం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన రోజు ఇది. గెలిచిన జగన్మోహన్ రెడ్డి, ఓడిన చంద్రబాబు నాయుడు ఇద్దరూ అవాక్కయిన రోజు. భారీ ఆధిక్యం జగన్ ఊహించనిది. భారీ ఓటమి కూడా చంద్రబాబు ఊహించలేదు. చాలామంది రాజకీయ ఉద్దండ పండితులు బొక్కబోర్లా పడ్డరోజు. “ఆంధ్రా ఆక్టోపస్”గా గుర్తింపు పొందిన లగడపాటి వంటి వారు వెల్లికిలా పడిన రోజు. ప్రజాభిప్రాయంపై ఆధిపత్యం కొనసాగిస్తున్న మీడియా కూడా తలవంచిన రోజు. ఊహకు అందని ఫలితాలు. ఊహించని ఆధిక్యం. అనూహ్యమైన ఓటమి. ఇవన్నీ మూటగట్టి ప్రజలు ఒకే రోజు పండితులు, ఉద్దండులు, మేధావులపై విసిరిన రోజు.

చంద్రబాబు ఓటమిని, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అంచనా వేసిన కొద్దిమంది కూడా నివ్వెరపోయేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. గెలుపు ఓటమి మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉంటుందని గెలిచిన నేతలు కానీ, ఓడిన నేతలు కానీ, విశ్లేషకులు కానీ ఊహించని తీర్పు. అయితే ఫలితాల విశ్లేషణలో ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు ప్రామాణికంగా తీసుకున్నది విశ్వసనీయత ఒక్కటే. నాయకుడి విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇచ్చారు.

నాయకుడి పట్ల నమ్మకం – అపనమ్మకం అనే అంశాలు 2019 ఎన్నికలను బాగా ప్రభావితం చేశాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం, లేదా ఆయన వ్యక్తిత్వం పాతిక శాతమే. మిగిలిన 75 శాతం చంద్రబాబును ప్రామాణికంగా తీసుకునే ప్రజలు తీర్పు ఇచ్చారు. “మాట తప్పను, మడమ తిప్పను” అని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పిన విషయం ప్రజలు ఆలోచించుకోడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఎన్ని కష్టాలు ఉన్నా తన పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల నేతలతో రాజీనామా చేయించడాన్ని ప్రజలు “విశ్వసనీయతకు” ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే 2019 ఎన్నికలు నాయకుడి విశ్వసనీయతే కొలమానంగా జరిగాయి.

Also Read:సంక్షేమంలో కొత్త పుంతలు, అన్నింటా జగన్ మార్క్

చంద్రబాబు నమ్మశక్యం కానీ నేత

విశ్వసనీయత అంశంలో చంద్రబాబు నమ్మశక్యం కానీ నేతగా గత ఐదేళ్ళలో బాగా గుర్తింపు పొందారు. “నమ్మశక్యం కానీ వ్యక్తి” గా “నమ్మదగని వ్యక్తి”గా చంద్రబాబును ప్రజలు గుర్తించారు. ఓటు ఈ ప్రాతిపదికనే వేశారు. చంద్రబాబు నమ్మశక్యం కానీ వ్యక్తిగా గుర్తింపు పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాకపోవడం, ఏదైనా అమలు చేశానని ఆయన చెప్పినా అవి అరకొరగా అమలు కావడం ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయేందుకు చాలా వరకు దోహదం అయ్యాయి. రైతు, మహిళా మరియు చేనేత రుణమాఫీ, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు చంద్రబాబు విశ్వసనీయతను బాగా దెబ్బకొట్టాయి. “చంద్రబాబును నమ్మలేం” అని “ఆయన చెప్పినా చెయ్యడు” అని జనం నిర్ధారణకు వచ్చేశారు. ఎన్నికల ముందు “అన్నదాత సుఖీభవ” అన్నా, అక్క చెల్లెమ్మలకు “పసుపు కుంకుమ” అన్నా లేక “అన్న క్యాంటీన్” అన్నా జనం చంద్రబాబును నమ్మలేదు. అప్పటికే ఆయన విశ్వసనీయత కోల్పోయారు.

రాజకీయ అవకాశవాదం

రాజకీయాల్లో విలువలు గురించి ఎవరూ మాట్లాడరు. బహుశా అలా విలువల గురించి మాట్లాడే రాజకీయనాయకుడు ఎవరూ ఇప్పుడు కనిపించరేమో! ప్రజలు కూడా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడడం మానివేశారు. అయితే అవకాశవాదం అనే విషయాన్ని మాత్రం ప్రజలు అంగీకరించలేదు. గడచిన ఐదేళ్ళలో చంద్రబాబు తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం, చేసిన ప్రతి రాజకీయ ప్రకటనను ప్రజలు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం, వారిలో నలుగురిని మంత్రులను చేయడాన్ని ప్రజలు అంగీకరించలేదు. వాస్తవానికి ఫిరాయింపులు కొత్తవి కాకపోయినా ప్రజలు ఈ విషయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఫిరాయింపుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరే ఇందుకు కారణం. చంద్రబాబు రాజకీయాలను, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలతో పోల్చి చూసినప్పుడు చంద్రబాబు 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో దిగజారి కనిపించగా, జగన్మోహన్ రెడ్డి ఆకాశమంత ఎత్తులో కనిపించారు. అందుకే ప్రజలు ఈ చర్యను అంగీకరించలేదు.

ఫిరాయింపులు ఒక్కటే కాదు రాజకీయ పొత్తులు, ఎత్తులు కూడా ప్రజలు లోతుగానే గమనించారు. బీజేపీతో నాలుగేళ్ళ బంధం, ఆ బంధం కోసం రాష్ట్ర ప్రయోజనాలు (ప్రత్యేకించి ప్రత్యేక హోదా వంటి విషయాలు) తాకట్టు పెట్టడం, చివరి సంవత్సరంలో బీజేపీతో వైరం తెచ్చుకోవడం, పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టడం వంటి అంశాలను ప్రజలు అవకాశ వాధంగా చూశారు. అవకాశవాదాన్ని ప్రజలు అంగీకరించరు. ఏ ఎండకాగొడుగు పట్టడాన్ని ప్రజలు ఆమోదించరు. బీజేపీతో విబేధం కానీ, కాంగ్రెస్ తో పొత్తును కానీ ప్రజలు అంగీకరించలేదు. ఈ పొత్తు (కాంగ్రెస్ తో), ఈ పోటీ (బీజేపీతో) రాష్ట్రానికి అవసరం అవసరం అని చంద్రబాబు ఎన్ని రకాలుగా చెప్పినా ప్రజలు అంగీకరించలేదు. చంద్రబాబు చర్యలను రాచక్రీడగానే ప్రజలు చూశారు.

Also Read:జగన్ కి ఆటంకాలన్నీ అక్కడే , అయినా అవకాశాలుగానే

కొందరి కోసమే రాజధాని

హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతాన్ని ఒక వర్గం పూర్తిగా ఆక్రమించుకుంది.కారణాలు వేరే అయినా, హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చిన చంద్రబాబు రాజధాని నగరంగా “అమరావతి”ని ప్రతిపాదించినపుడు ప్రజలు స్వాగతించారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు పలికారు. బహుళ పంటలు పండే భూముల సేకరణను వ్యతిరేకించినప్పటికీ చాలా మంది అమరావతిని స్వాగతించారు.

అయితే అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఒక ఎత్తు, అక్కడ భూముల్లో ఒక వర్గం చేసిన నిర్వాకం ఒక ఎత్తు. అమరావతిలో ప్రతి ఎకరం భూమి ఒకే వర్గం చేతిలో ఉంది. చంద్రబాబు చుట్టూ ఉండే వారు, ఆయన అనుయాయులు, ఆ వర్గం ప్రతినిధులు అమరావతి భూముల్లో పాగా వేశారు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు అమరావతి “ప్రజల రాజధాని” అంటే “అమరావతి ఎవరి రాజధాని” అంటూ విద్యావంతులు పుస్తకాలు వేసి ప్రశ్నించారు.

దెబ్బ కొట్టిన అమరావతి

ఇక రెండో వైపు అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన హంగామాను ప్రజలు విశ్వసించలేదు. విదేశీ సదస్సులు, విదేశీ ప్రయాణాలు, ఆకృతుల పేరుతో చంద్రబాబు చేసిన హడావుడి, దుబారా వ్యయాన్ని ప్రజలు అంగీకరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి విషయంలో చంద్రబాబు విదేశీ మోజును ప్రజలు ఆమోదించలేదు. విదేశీ మోజులో కూడా ఒక్క దేశం కాదు. ఒక్క నగరం కాదు. ఆ మూడేళ్ళలో అనేక దేశాలూ, అనేక నగరాల నమూనాలను అమరావతిలో ఆవిష్కరించారు. ఈ క్రమంలో కూడా చంద్రబాబు తన సామాజిక వర్గం పెట్టుబడి దారులను, ఎన్నారైలను వెంటబెట్టుకుని, వారితో వ్యాపారం చేయించడాన్ని కూడా ప్రజలు అంగీకరించలేదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ఓటమికి అమరావతి 50 శాతం కారణం అయితే మిగతా అంశాలు మిగిలిన 50 శాతం కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా అమరావతిని రాష్ట్ర ప్రజలు తమ స్వంతం అని అనుకోకపోవడానికి కారణం ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. రాజధాని నగరం తమ ప్రాంతం నుండి వెళ్ళిపోతుందని ప్రచారం జరుగుతున్నా ప్రజలు స్పందించకపోవడానికి కారణం అమరావతి తమ నగరం అని ప్రజలు అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలుగు ప్రజలు చంద్రబాబు చూపించిన అమరావతిని తమ నగరంగా అనుకోలేరు.

ప్రత్యేక హోదా “U” టర్న్

బీజేపీతో చెలిమి చేసినన్నిరోజులు ప్రత్యేక హోదా అడిగినవాళ్లను రాష్ట్ర ద్రోహులుగా చిత్రించి ప్రచారం చేసింది. ఎన్నికలు కు సంవత్సరం ముందు యూ టర్న్ తీసుకొని తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ,కృతికమైన పోరాటం చేయటం చంద్రబాబు విశ్వసనీయతను మరింత తగ్గించింది ..

పట్టిసీమ భ్రమలు
నేనుకట్టిందే ప్రాజెక్ట్,అదే అద్భుతం అంటూ పట్టిసీమ పేరుతొ చంద్రబాబు చేసిన ప్రచారం ప్రజల్లో విసుగు తెపించింది. మరి మా ప్రాజెక్టుల సంగతేమిటి అని అడిగిన రాయలసీమ వారికి “పట్టిసీమ మీ కోసమే” అన్న చంద్రబాబు మాటలు కోపాన్ని తెప్పించాయి.
రాయలసీమలో నికరంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తికాకవటం టీడీపీ మీద వ్యతిరేకతకు మరో కారణం.

Also Read:నీరు చెప్తున్న సత్యం..చంద్రబాబు చెప్తున్న అసత్యం .. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ చరిత్ర

మరోవైపు గోదావరి డెల్టాలో,పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి పట్టిసీమ పేరుతో తమ నీళ్లను కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు.ఒకటికి రెండుసార్లు శంకుస్థాపనలు తప్ప పోలవరంలో పురోగతి లేకపోవటం కూడా డెల్టా ప్రజలను కలవర పరిచింది.

యేడాది తర్వాత అయినా తన ఓటమికి చంద్రబాబు సరైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే యేడాది క్రితం తాను చవిచూసిన భారీ ఓటమినుండి ఆయన ఎప్పటికీ కోలుకోజాలరు. ఈ విశ్లేషణ చేయకపోతే, ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి 2019 నాటి పరాజయ పరాభవ పరంపర కొనసాగుతూనే ఉంటుంది.

Show comments