EC-AP Govt DBT Payments: EC క్లారిటీ.. APలో వారి ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే

EC క్లారిటీ.. APలో వారి ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే!

ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. లబ్ధిదారులు ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడో తెలిపింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. లబ్ధిదారులు ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడో తెలిపింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మే 13, సోమవారం నాడు ఏపీకి సంబంధించి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని దూకుడు పెంచాయి. జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. ఇక చంద్రబాబు అండ్‌ కో వల్ల పింఛన్ల పంపిణీలో జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో స్వయంగా చూశాం. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేయడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో పాటు.. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు విడుదల కూడా ఆగిపోయింది. ఈ క్రమంలో దీనిపై ఈసీ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు విడుదలపై ఈసీ స్పందిస్తూ.. పోలింగ్‌ ముగిసిన తర్వాతే.. అనగా మే 13 తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఈసీ సమాచారం అందించింది. దాదాపు 14 వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల విడుదలకు సంబంధించి స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా తమకు ప్రతిపాదనలు వచ్చాయని ఈసీ తెలిపింది. అయితే ఈ నగదును లబ్ధిదారుల ఖాతాలో వేస్తే.. అది ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన సైలెంట్‌ పిరియడ్‌కు ఇబ్బంది కలిగిస్తుందని.. దీని వల్ల లెవల్‌ ప్లేయింగ్‌ దెబ్బ తింటుందని ఈసీ చెప్పుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, జగనన్న విద్యా దీవెన, రైతు పెట్టుబడి సాయం ఇలా అనేక పథకాలకు సంబంధించిన నిధులు విడుదల ఆగిపోయింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. కానీ అంగీకరించకపోవడంతో.. నిధుల జమ ఆగిపోయింది. దాంతో లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున లాయర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నిధులన్ని ఆన్‌ గోయింగ్‌ పథకాలకు సంబంధించినవే అని.. వీటిని నిలిపి వేయడం సరికాదన్నారు. అంతేకాక ఇప్పుడు నిధులు విడుదల చేయకపోతే.. మే నెల చివరికి అవి మురిగిపోతాయని కోర్టుకు తెలిపారు. దీనిపై ఈసీ బదులిస్తూ.. మే 13 పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. ఆయా పథకాలకు సంబంధించిన నిధులన్ని లబ్ధిదారులు ఖాతాలో జమ చేసుకోవచ్చని తెలిపింది.

Show comments