15 ఏళ్లేనా బాబు గారు.. విజన్‌ 2050 చూడరా..?

15 ఏళ్లేనా బాబు గారు.. విజన్‌ 2050 చూడరా..?

15 ఏళ్లు బతుకుతా. ఆరోగ్యం బాంగుటే 20 ఏళ్లు జీవిస్తా.. ఇదీ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాట. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు తన ఆరోగ్యం, జీవించే కాలంపై చెప్పుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలా చెప్పని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు..? రాజధాని అమరావతి.. భవిష్యత్‌ తరాల వారి కోసమంటూ.. తాను ఎన్నేళ్లు బతుకుతానో చంద్రబాబు చెప్పడం వెనుక మరేదైనా కారణం ఉందా..? అసలు బాబు ఆరోగ్యం గురించి ఎవరైనా అడిగారా..? లేక ఏదైనా మీడియాలో ఆయన ఆరోగ్యంపై కథనాలు వచ్చాయా..? లేదే..! మరెందుకు చెబుతున్నట్లు..?!

బాబు శకం ముగిసిందని..

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. అధికారంలో ఐదేళ్లు కొనసాగి, సంక్షేమ పథకాల భారీగా చేశామని చెప్పుకున్నా కూడా టీడీపీకి ఓటమి తప్పలేదు. 175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అమరావతి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే అమరావతి అనే రేంజ్‌లో అభివృద్ధి చేశానని చెప్పిన ఆ ప్రాంతంలోనే స్వయానా ఆయన కుమారుడు నారా లోకేష్‌ పరాజయం పాలవడం టీడీపీ శ్రేణులను ఆలోచింపజేసింది. ఇంత చేసినా ఎందుకు ఓడిపోయాం..? భవిష్యత్‌ ఏమిటి..? మళ్లీ గెలవగలమా..? చంద్రబాబులో ఆ సత్తా ఉందా..? అలవిగానీ హామీలిచ్చి అమలు చేయకపోవడంతో ఓడించని ప్రజలు మళ్లీ చంద్రబాబును నమ్ముతారా..? అనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల మెదిలాయి. వారి అనుమానాలను బలపరచేలా టీడీపీ ప్రజా ప్రతినిధులు పార్టీకి దూరం కాసాగారు. అధికార పార్టీ ప్రలోభాలు పెడితే వెళ్లడం ఓలెక్క అయితే.. ప్రలోభాలు లేకుండా కనీసం పిలవకుండానే.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల వైపు చూశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లగా, ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్లుగా ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలు బటపడ్డాయి. చంద్రబాబు పని ఇంక అయిపోయిందని, నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు అంచనా కొచ్చారు.

లోకేష్‌ వల్ల కాదని..

ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 69 ఏళ్లు.. ఈ ప్రభుత్వ కాలం ముగిసేలోగా ఆయన వయస్సు 74కి చేరుకుంటుంది. ఆ వయస్సులో చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నట్లు రాజకీయాలు చేయగలడా..? ఉత్సాహంగా తిరగగలడా..? మాట్లాడగలడా..? అనే సందేహాలు టీడీపీ శ్రేణుల్లోనే కాదు రాజకీయ పరిశీలకుల్లోనూ నెలకొన్నాయి. ఇప్పటికే చంద్రబాబు చెప్పిందే పదే పదే చెబుతుండడంతో ఆయన జ్ఞాపకశక్తిపై పలు అనుమానాలు రేగాయి. ఒక వేళ చంద్రబాబు.. కరుణానిధి, కేసీఆర్‌ లాగా కూర్చుని రాజకీయాలు చేయాలనుకున్నా వారి కుమారులైన స్టాలిన్, కేటీఆర్‌ లాగా లోకేష్‌ సమర్థుడు కాదని ఇప్పటికే తేలిపోయింది. లోకేష్‌ను సానబట్టేందుకు ఎమ్మెల్సీని చేసి, ఆపై మంత్రిని చేసినా కూడా ఏ మాత్రం వన్నే రాకపోగా డొల్లతనం బయటపడింది. సబ్జెక్ట్, వాక్ఛాతుర్యం లేకపోగా తడబడుతూ ప్రత్యర్థి పార్టీలకు లోకేష్‌ బాబే ఆయుధాలు అందిస్తున్నారు. అనుకూల మీడియా, పార్టీ శ్రేణులు లోకేష్‌కు జాకీలేసి ఎంత లేపాలని చూసినా సాధ్యం కావడంలేదు. ఈ విషయం టీడీపీ శ్రేణులకూ అర్థమైంది. పార్టీని లోకేష్‌ నడపలేరు.. వైఎస్‌ జగన్‌కు లోకేష్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేరనే అంచనాకు టీడీపీ కార్యకర్తలు వచ్చేశారు.

తెరపైకి జూనియర్‌ ఎన్టీఆర్‌…

ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేష్‌ భవిషత్య్‌ నాయకత్వంపై ఓ అంచనాకు వచ్చిన టీడీపీ శ్రేణులు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపోయినా.. మరో పదేళ్లకైనా జూనియర్‌ ఎన్టీఆర్‌ వల్లనే టీడీపీకి అధికారం సాధ్యమనే భావనలో టీడీపీ శ్రేణులున్నాయి. సీనియర్‌ ఎన్టీఆర్‌ పోలిక, వాగ్ధాటి గల జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రమే పార్టీని నడపగలడని ఆ పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సత్తా ఏమిటో అందరూ చూశారు. ఇప్పటికే టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రియాశీలకంగా వ్యవహరిచాలన్న డిమాండ్‌ అక్కడక్కడా వినిపిస్తోంది. పార్టీ బ్యానర్లలో జూనియర్‌ ఫోటోలు కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఎన్టీఆర్‌ ఫొటోలతో పోస్టులు వస్తున్నాయి.

అందుకే బాబు బతుకు పల్లవి..

పై కారణాలతోనే తాను ఎన్నేళ్లు బతుకుతానో చంద్రబాబు పదే పదే చెబుతూ కార్యకర్తల ఆలోచనలు పక్కకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. 15 లేదా 20 ఏళ్లు అంటే 2034 లేదా 2039 వరకు కూడా చంద్రబాబు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటానని చెప్పకనే చెబుతున్నారు. ఈ విధంగా ముందుకుపోతూ.. పార్టీని రక్షించుకునే పనిలో ఉన్నారు. ఈలోపు లోకేష్‌ను ఇంకా సానబట్టీ తన స్థానాన్ని అప్పగించొచ్చనే ఆలోచన చంద్రబాబులో ఉన్నట్లుగా ఆయన తీరును బట్టి అర్థమవుతోంది. మరి చంద్రబాబు బతుకు వ్యూహం ఫలిస్తుందా..? విజన్‌ 2050 అని చెప్పిన బాబు.. ఈ విజన్‌ చూడరా..? వేచి చూడాలి.

Show comments