స్కూలు బస్సును ఢీకొన్న కారు.. MLA భార్యకు గాయాలు!

ఈ మధ్య కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతి వేగం, తాగి వాహనాల్ని నడపటం.. నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ రోడ్డు​ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, వరంగల్‌ జిల్లాలో కారు- స్కూలు బస్సు ఢీకొన్నాయి. ఎమ్మెల్యే భార్య ప్రయాణిస్తున్న కారు విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ బస్సును ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే భార్యతో పాటు 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే భార్య జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న కారులో ప్రయాణిస్తూ ఉన్నారు.

కమలాపురం క్రాస్‌ రోడ్‌ వద్ద ఎమ్మెల్యే భార్య ప్రయాణిస్తున్న కారు ఓ ప్రైవేట్‌ స్కూలు బస్సును ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. బస్సు కూడా బాగా దెబ్బతింది. ఇక, ప్రమాదం సమయంలో కారులో సేఫ్టీ ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవటంతో స్వప్నకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే ఘోరం జరిగేది. అయినప్పటికి స్వప్నతో పాటు 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు ఎమ్మెల్యే భార్యను వరంగల్‌ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను నర్సంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం వారికి అక్కడే చికిత్స అందుతోంది. ఇక, ఈ ప్రమాదంలో పిల్లలు గాయపడ్డంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం విషయంలో పోలీసుల తీరును వారు తప్పుబడుతున్నారు. పోలీసులు ఎమ్మెల్యే కుటుంబసభ్యుల కోసమే ఉన్నారా? అంటూ నిలదీస్తున్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరి,  ఎమ్మెల్యే భార్య ప్రయాణిస్తున్న కారు స్కూలు బస్సును ఢీకొట్టడంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments