Khammam Orphan Child-US Couple: ఖమ్మం: కన్నవాళ్లు కాదనుకున్నారు.. అమెరికా దంపతులు అక్కున చేర్చుకున్నారు

ఖమ్మం: కన్నవాళ్లు కాదనుకున్నారు.. అమెరికా దంపతులు అక్కున చేర్చుకున్నారు

నవమాసాలు మోసి కన్న బిడ్డ ఆ తల్లికి బరువయ్యింది. ఆడపిల్లని వద్దనుకున్నారో.. మరి వేరే కారణమో తెలియదు కానీ ఏడాది వయసున్న ఆ చిన్నారిని.. ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారు. చిన్నారిని గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది.. పాప తల్లిదండ్రుల కోసం వెతికారు. కానీ వారి ఆచూకీ తెలియకపోవడంతో.. చిన్నారిని అనాథగా ప్రకటించారు. ఆ తర్వాత కారా వెబ్‌సైట్‌లో చిన్నారి వివరాలు అప్‌లోడ్‌ చేశారు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే కన్నవాళ్లు వద్దనుకున్న ఆ చిన్నారిని.. అమెరికా దంపతులు అక్కున చేర్చుకున్నారు. అనాథ చిన్నారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ వివరాలు..

అమెరికాకు చెందిన దంపతులు ఫ్లోరియన్ హాక్ల్, గీనా కురియకోస్ అతప్పిలీ.. భారతదేశానికి చెందని చిన్నారిని దత్తత తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో భారత దేశం పిల్లలను దత్తత తీసుకోవాలంటే.. ఏం చేయాలి.. రూల్స్‌ ఎలా ఉన్నాయి వంటి వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర శిశు, మహిళా సంక్షేమశాఖ ద్వారా అధికారికంగా www.cara.nic.in లో బాలిక దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి.. వివరాలు తెలుసుకుని.. దత్తతకు కావాల్సిన పత్రాలను సమర్పించారు.

అమెరికా దంపతులు సమర్పించిన పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత.. ఖమ్మం కలెక్టర్‌.. చిన్నారి దత్తతకు అంగీకరించారు. ఈ క్రమంలో ఖమ్మం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఫ్లోరియన్ హాక్ల్, గీనా కురియకోస్ అతప్పిలీ దంపతులకు చిన్నారిని అప్పగించారు. పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే వారు www.cara.nic.in నుండి చట్టబద్దంగా స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ద్వారా అధికారికంగా దత్తత కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆ దంపతులు బాలికను అక్కున చేర్చుకుంటూ.. ఇక మీదట తమకు పిల్లలు లేని లోటు తీరుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Show comments