Revanth Reddy-Mucherla, 4th City, Hyd: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో మరో నగరం.. 4 వేల ఎకరాల్లో.. ఎక్కడంటే

Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో మరో నగరం.. 4 వేల ఎకరాల్లో.. ఎక్కడంటే

Revanth Reddy-Mucherla, 4th City, Hyderabad: భాగ్యనగరంలో మరో నగరాన్ని నిర్మించబోతున్నారు. సుమారు 4 వేల ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఆ వివరాలు..

Revanth Reddy-Mucherla, 4th City, Hyderabad: భాగ్యనగరంలో మరో నగరాన్ని నిర్మించబోతున్నారు. సుమారు 4 వేల ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరానికి మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం ఎంతో గుర్తింపు ఉంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కంపెనీల బ్రాంచీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక భాగ్యనగరం ఎందరికో ఉపాధి కల్పించే కల్ప తరువు. దేశంలోని నలువైపుల నుంచి ఎందరో ఉపాధి కోసం భాగ్యనగరానికి తరలి వస్తుంటారు. ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే.. భాగ్యగనరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే బాటలో పయనిస్తుంది. హైదరాబాద్‌ అనగానే ఒకప్పుడు ముత్యాలు గుర్తుకు వచ్చేవి. అయితే తర్వాత కాలక్రమేణ ఐటీ, ఫార్మా రంగాలకు విశ్వనగరం బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ క్రమంలో భాగ్యనగరం అభివృద్ధి కోసం రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మరో నగరాన్ని నిర్మించబోతుంది. ఆ వివరాలు..

ఇప్పటికే రాజధాని నగరంలో ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ అని మూడు నగరాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో మరో నగరం యాడ్‌ కానుంది. హైదరాబాద్‌లో నాలుగో నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఈ నాలుగో నగరాన్ని.. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఈ నాలుగో నగరంలో ఆరోగ్య, క్రీడా హబ్‌లు ఏర్పాటు చేస్తామన్న సీఎం, మెట్రోతో అనుసంధానం చేస్తామని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయం నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరకు అనేక రంగాలపై నూతన విధానాలు రూపొందిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇక ముచ్చర్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్యసేవల నుంచి ఉపాధి వరకు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, క్రికెట్‌ స్టేడియం నుంచి గోల్ఫ్‌ కోర్స్‌ వరకు అన్నీ సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాక త్వరలో నిర్మించబోయే నాలుగో నగరం ముచ్చర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారన్న సీఎం.. ఇప్పుడు అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. మత్తు మందుకు బానిసగా మారుతోన్న యువత దృష్టిని క్రీడలపై మళ్లించేందుకు క్రీడా హబ్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Show comments