ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందా ?

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరిది అయిన 5 వ టెస్ట్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అయిదు టెస్ట్ ల సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న భారత్… ఆ మ్యాచ్ కూడా గెలిచి సీరీస్ గెలుచుకోవాలని భావిస్తున్న క్రమంలో… కరోనా అడ్డు పడే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. భారత జట్టు సహాయక సిబ్బందిలో మరొకరు నేడు కరోనా బారిన పడిన నేపధ్యంలో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జట్టు చీఫ్ కోచ్ రావిశాస్త్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బంది అలాగే జట్టు సభ్యులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నిర్వహించిన పరీక్షలలో ఫిజియో యోగేష్ పర్మార్ కరోనా బారిన పడ్డారని తెలిసింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మరియు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ లకు ముందు పరిక్షలు నిర్వహించలేదు. దీనితో వారు తర్వాత కరోనా బారిన పడినట్టుగా బయటపడింది. ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

టీం ఇండియా సోమవారం మాంచెస్టర్ చేరుకుంది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో గత క్రికెట్ సిరీస్‌లు మరియు టోర్నమెంట్ల మాదిరిగా ఇంగ్లాండ్‌లో 5-టెస్టుల సిరీస్ బయో బబుల్ వాతావరణంలో ఆడలేదు. ఇంగ్లాండ్ కోవిడ్ -19 ఆంక్షలను సడలించడంతో, ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది ఫ్రీగా తిరిగారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి 4 వ టెస్టుకు ముందు లండన్‌లో తన పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యారు. లండన్‌లో జరిగిన 4 వ టెస్టులో అద్భుతంగా పుంజుకుని 5 టెస్టుల సిరీస్‌లో 2-1తో భారత్ ముందంజలో ఉంది.

మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రస్తుతానికి మ్యాచ్ జరుగుతుందో లేదో మాకు తెలియదు అని అన్నారు. మ్యాచ్ జరిగే అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయని గంగూలీ కోల్‌కతాలో జరిగిన ‘మిషన్ డామినేషన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ వేసారు. అయినా సరే వారు కరోనా బారిన పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Show comments