వైసీపీ ఎంపీ మీద సోమిరెడ్డికి ప్రేమనా లేక ప్రత్యర్థి ఎమ్మెల్యే మీద పగనా ?

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సందర్భం, విషయం ఏదైనా ఒకరిపై ఒకరు చాలెంజ్ చేసుకోవడం నియోజకవర్గంలో సహజమైపోయింది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పై సోమిరెడ్డి అసత్య ఆరోపణలతో వైసీపీలో సొంత పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. నియోజకర్గంలో తన పట్టుతప్పుతుందని భావించి సోమిరెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నాడు.

మొన్నటి వరకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో ఎమ్మెల్యే పై తీవ్ర ఆరోపణలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ తవ్వకాల్లో ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రావెల్ తవ్వకాల్లో వైసీపీ ఎంపీని సపోర్ట్ చేస్తూ టిడిపి నేత చంద్ర మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వేపల్లిలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వైరం పెంచేలా ఉన్నాయని సర్వేపల్లిలో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సర్వేపల్లిలో గ్రావెల్ తవ్వకాల కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేరుతో ఎమ్మెల్యే అనుచరులు ఫోర్జరీ సంతకాలతో నీటిపారుదల శాఖ నుండి మైనింగ్ అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. ఎంపీ పేరు చెప్పి ఎమ్మెల్యే గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇలా సోమిరెడ్డి అధికార పార్టీ నేతల మీద ఆరోపణలు చేయడం చివరకు తోక ముడవడం సాధారణంగా మారింది. 1994, 19999లో గెలిచిన సోమిరెడ్డి తరువాత వరుస ఎన్నికలలో ఓటమిపాలవుతూ వస్తున్నారు. మళ్ళీ నియోజకవర్గంలో పట్టుకోసం సోమిరెడ్డి వైసీపీ నేతల మీద ఆరోపణలు చేయడమే కాకుండా వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాకాని ఫైర్..

మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఆరోపణలపై ఏపీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ మరోసారి మండిపడ్డారు. ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్వలేకనే మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఇలా దిగజారి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించాడు. తాజాగా గ్రావెల్ మైనింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. 2014 నుంచి ఇప్పటివరకూ అవినీతి ఎవరి హయాంలో జరిగిందో విచారణ జరిపిద్దామని సవాలు విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణకైనా , హై కోర్టులో పిల్ కైనా సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ముంటే సోమిరెడ్డి తన సవాలును స్వీకరించాలన్నారు. తన హయాంలో అవినీతి జరిగిందని తేలితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని తెలిపారు.

అయితే నియోజకవర్గంలో కాకాని వర్సెస్ సోమిరెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలో బలం లేని సోమిరెడ్డి ఇలా చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మొన్న ఆనందయ్య కరోనా మందు విషయంలో కూడా ఆన్‌లైన్‌లో పంపిణీ పేరుతో కాకానీ కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేయగా మాజీ మంత్రి.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్ కేసు కూడా నమోదైంది. తాజగా గ్రావెల్ మైనింగ్ విషయంలో ఎంపీకి సపోర్టుగా ఎమ్మెల్యే కాకాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం పలు విమర్శలకు తావిస్తోంది. సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వైసీపీ నేతల మీద స్వార్ధ పూరితంగా విమర్శలు చేయడం మంచిది కాదని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు.

Show comments