అధికారులకు ఒంగి ఒంగి దండాలు.. జేసీ నాటకాలు

ఏ ఎండకు ఆ గొడుగు.. ఏ గాలికి ఆ చాప ఎత్తడం.. అనే సామెతలు జేసీ బ్రదర్స్‌కు వ్యవహార శైలికి అతికినట్లు సరిపోతాయని వారి ప్రత్యర్థులు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూసిన తర్వాత బహుసా ఆ విమర్శలు నిజమేనని అనిపిస్తుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా.. అవసరమైనప్పుడు ఓడ మల్లన్న.. అవసరం తీరాక బోడి మల్లన్న మాదరిగా జేసీ బ్రదర్స్‌ రాజకీయాలు చేస్తుంటారు. తాజాగా తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఘటన జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్యాలయ సిబ్బందికి మున్సిపల్‌ చైర్మన్‌ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఒంగి మరీ దండాలు పెట్టి నాటకాలాడారు.

పరస్పర అభివాదాలు, నమస్కారాలు పెట్టడడం తెలుగు సాంప్రదాయం. అయితే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాత్రం అధికారులను హేళన చేసేందుకు ఒంగి దండాలు పెట్టారు. మున్సిపల్‌ కమిషనర్, సిబ్బందితో సమావేశం అయ్యేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి సోమవారం సిద్ధమయ్యారు. అయితే అంతకు ముందే ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. కరోనా మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్ష సమావేశం ఏర్పాటు నిర్ణయించారు. అధికారులు ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లారు. అయితే మున్సిపల్‌ చైర్మన్‌ అయిన తాను సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైతే.. అధికారులు గౌర్హాజరవుతారా..? అంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కాసేపు కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో చిందులు తొక్కారు. కరోనా మూడో దశ అవగాహన ర్యాలీ, సమీక్ష తర్వాత కార్యాలయానికి వచ్చిన అధికారులను అవహేళన చేసేలా.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఒంగి దండాలు పెట్టారు. అంతేకాదు.. కమిషనర్‌తో సహా మున్సిపల్‌ సిబ్బంది కనిపించడం లేదని, వారికి ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు, సిబ్బంది వచ్చి క్షమాపణ చెప్పాలంటూ రాత్రి కార్యాలయంలోనే తిని, పడుకున్నారు.

Also Read : కాకినాడ లో టీడీపీకి తప్పని కాక, మేయర్ పీఠానికి ఎసరు తప్పదా?

అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు తమ బానిసలనే మాదిరిగా జేసీ బ్రదర్స్‌ వ్యవహరించిన సందర్భాలున్నాయి. వివిధ విభాగాల అధికారులు, పోలీసులపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన అన్న జేసీ దివాకర్‌ రెడ్డిలు నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జేసీ దివాకర్‌ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. జిల్లా పోలీసులను ఉద్దేశించి దుర్భాషలాడిన ఘటన సంచలమైంది. వీరికి కౌంటర్‌గా అప్పటి సీఐ, ప్రస్తుత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మీసం మెలేసి సవాళ్లు విసిరారు. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల.. ఆ తర్వాత వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఫోర్జరీ పత్రాలతో కాలం చెల్లిన వాహనాలను విక్రయించిన కేసులో సోదాలకు వచ్చిన పోలీసులపై జేసీ దివాకర్‌ రెడ్డి బూతులు లంకించుకున్నారు. నాడు ఇలా వ్యవహరించిన జేసీ బ్రదర్స్‌.. ఇప్పుడు తిట్ల పురాణం అందుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించారేమో.. రూటు మార్చి ఇలా ఒంగి ఒంగి దండాలు పెట్టి తన ఇగోను సంతృప్తి పరుచుకున్నారు.

గత సాధారణ ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా, జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయారు. రాజకీయంగా తమ ప్రభవం కోల్పోతుండడంతో.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్థాయిని తగ్గించుకుని మరీ కౌన్సిలర్‌గా పోటీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ అయితే.. మళ్లీ పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుందని భావించారు. 36 వార్డులకు గాను వైసీపీ 16. టీడీపీ 18, సీపీఐ, స్వతంత్రులు ఒక చోట గెలుపొందారు. వారి సహాయంతో మున్సిపల్‌ చైర్మన్‌ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. వైఎస్‌ జగన్‌ నీతివంతమైన రాజకీయాలు చేయడం వల్లే తాను గెలిచానని కొనియాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవసరమైతే సీఎం వైఎస్‌ జగన్‌ను కలుస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యర్థులపై కుట్రలు ఆపలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి ఇసుక విక్రయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ చేసిన ప్రచారం తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డిల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ క్రమంలో తాడిపత్రిలో ఆధిపత్యం కోసం మున్సిపల్‌ చైర్మన్‌ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఎమ్మెల్యేతో పెద్దారెడ్డితో పోటాపోటీగా రాజకీయాలు చేస్తూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు.

Also Read : అనంతపురంలో రూపు మార్చనున్న “కార్బన్‌” గోల్డెన్‌ గ్లోబ్‌ హార్మోని సిటి

Show comments