చంద్రబాబును కలవరపెడుతున్న గల్లా..!

తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు, తన కుమారుడును వారసుడుగా తెరపైకి తెచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలు ఒకడు ముందుకు, మూడడుగులు వెన క్కి చందంగా సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చతికిలపడిన పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలంటూ ఈ రెండేళ్లలో ఏమీ లేవు. అయితే ఇవేమీ టీడీపీని రక్షించే పరిస్థితిలో లేవని తెలిపోతోంది. నాయకులు పార్టీని వీడి తమ దారి తాము చూసుకునే పనిలోనే ఉన్నారు. తాజాగా గల్లా అరుణకుమారి వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతోంది.

గల్లా అరుణకుమారి జన్మదినం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఆమె అభిమానులు ఫ్లెక్సీలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫ్లెక్సీలలో గల్లా అరుణకుమారి, ఆమె కుటుంబ సభ్యులు మినహా.. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ లోగో, జెండాలు లేవు. తెలుగుదేశం ఫ్లేవర్‌ లేకుండా ఈ ఫ్లెక్సీలు వేయడంతో గల్లా పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

గత ఏడాది ఆఖరున టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే అక్టోబర్‌లో గల్లా అరుణకుమారి పార్టీ పోలిట్‌ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో గల్లా అరుణ వైసీపీ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌ను చంద్రగిరి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో.. ఆమెను నియోజకవర్గ ఇంఛార్జి పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. ఆ సమయంలో ఆమె తన మద్ధతుదారులతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. అరుణను చల్లబర్చేందుకు ఆమెకు పోలిట్‌ బ్యూరో పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో సీటు దక్కలేదు. అయితే ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌ వరుసగా రెండోసారి గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు.

Also Read : పదవుల పంట.. కారును గమన్యానికి చేర్చునా..?

2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితితోపాటు.. ఆ పార్టీని ఆధారంగా చేసుకుని వ్యాపారాలను చేస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. గల్లా వ్యాపార సంస్థ అమరరాజా బ్యాటరీస్‌ చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు కేటాయించిన భూములను సకాలంలో వినియోగించకపోవడంతో ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా కాలుష్య నియంత్రణ బోర్డు.. యూనిట్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్‌లు టీడీపీని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. మళ్లీ ఆరు నెలల తర్వాత ఇప్పుడు గల్లా అరుణకుమారి జన్మదినం సందర్భంగా వేసిన ఫ్లెక్సీలతో ఆ కుటుంబ పయనంపై జోరుగా చర్చ మొదలైంది.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న గల్లా అరుణకుమారి 1989లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మరుసటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా రామూర్తినాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. వైఎస్సార్‌ హయాంలో మంత్రిగా పని చేశారు. చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో తన కుమారుడు గల్లా జయదేవ్‌తో కలసి టీడీపీలో చేరారు. గుంటూరు ఎంపీగా తొలిసారి పోటి చేసిన జయదేవ్‌ గెలవగా.. చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అరుణకుమారి ఓటమి చవిచూశారు. తాజా పరిస్థితుల్లో కుమారుడు జయదేవ్‌తో కలసి ఆమె పయనం ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : మాజీమంత్రి కోండ్రు మురళీ టీడీపీలో ఉన్నట్టా..లేనట్టా?

Show comments