Idream media
Idream media
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో ఈదర హరిబాబుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినా.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి నడిచినా.. ఆయనను ఎన్టీఆర్ అభిమానిగానే తెలుగుదేశం శ్రేణులు భావిస్తాయి. 1994లో తొలిసారి ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఈదర హరిబాబు ఎన్టీఆర్ హాయంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. నాటకీయ పరిణామాల మధ్య 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఈదర హరిబాబు ఎన్టీఆర్ నాటక కళాపరిషత్‌ను ఏర్పాటు చేసి ప్రతి ఏడాది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. 1995 ఆగస్టు పరిణామాల అనంతరం టీడీపీ చంద్రబాబు చేతికొచ్చింది. 1999 ఎన్నికల్లో ఎన్టీఆర్ వర్గం నేతలను పక్కనపెట్టేశారు. ఇందులో ఈదర హరిబాబు కూడా ఒకరు. 1999 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈదర హరిబాబుకు దక్కలేదు. టీడీపీ టిక్కెట్ యక్కాల తులసీరావుకు దక్కింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టిక్కెట్ ఇవ్వని బాబుపై హరిబాబు తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 24,963 ఓట్లను సాధించారు. టీడీపీ అభ్యర్థికి కేవలం 38,485 వచ్చాయి. యువజన కాంగ్రెస్ లీడర్‌గా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి 44,707 ఓట్లు సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు 1999, 2004, 2009, 2012(ఉప ఎన్నిక) బాలినేని గెలిచారు. 2014లో తొలిసారి ఓడిపోయారు. మళ్లీ 2019లో గెలిచారు.
Also Read : మాజీ మంత్రి బాలరాజు రాజకీయాల్లో ఉన్నాడా?
2004లోనూ బాబు హరిబాబుకు మొండిచేయి చూపారు. ఈ సారి వైశ్య సామాజికవర్గానికి చెందిన, గ్రానైట్ వ్యాపారి శిద్ధా రాఘవరావును బరిలోకి దించారు. గెలుపు కోసం కుల సమీకరణాలతో రాజకీయాలు చేసే చంద్రబాబు పాచిక.. ఈ సారి కూడా ఒంగోలులో పారలేదు. ఇక లాభం లేదనుకుని 2009లో బాలినేని హాట్రిక్ విజయాన్ని అడ్డుకునేందుకు ఈదర హరిబాబుకు టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్‌పీ మధ్య త్రిముఖ పోరు సాగింది. ఈదర హరిబాబు ఓడిపోయారు. పీఆర్‌పీ తరఫున గ్రానైట్ వ్యాపారి ఆనంద్ పోటీ చేశారు. ఆ ఎన్నికల తర్వాత నుంచి ఆనంద్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
వైసీపీ అవిర్భావం తర్వాత బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలో 2012లో ఒంగోలుకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ సారి ఈదరను మళ్లీ పక్కనపెట్టిన చంద్రబాబు.. కొండపి నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనమడు దామచర్ల జనార్థన్‌ను బరిలోకి దింపారు. ఈదర హరిబాబుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తామనే హామీ ఇచ్చారు. ఇదే మాట చెప్పి 2014లోనూ జనార్థన్‌కే టిక్కెట్ ఇచ్చారు. ఈదర వర్గం కూడా పని చేయడంతో జనార్థన్ గెలిచారు. తొలిసారి బాలినేని శ్రీనివాస రెడ్డి ఓటమిని చూశారు.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈదర హరిబాబు కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడైన దామచర్ల జనార్థన్ చక్రం తిప్పారు. మన్నే రవీంద్రను టీడీపీ జడ్పీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. 56 జడ్పీ స్థానాలకు గాను వైసీపీ 31, టీడీపీ 25 స్థానాలు గెలుచుకున్నాయి. జడ్పీ చైర్మన్ సీటు వైసీపీకి దక్కాల్సి ఉండగా.. అధికారంలో ఉన్న టీడీపీ ముగ్గురు వైసీపీ జడ్పీటీసీలను తనవైపునకు తిప్పుకుంది. ఫలితంగా ఇరు పార్టీలు 28 చొప్పన సమానంగా నిలిచాయి.
Also Read : ప్చ్.. లోకేశ్ : ఇలా అయితే ఎలా?
జడ్పీ చైర్మన్ ఎన్నిక రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ అభ్యర్ధిగా నూకసాని బాలాజీ (ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నారు), టీడీపీ తరఫున మన్నే రవీంద్ర నామినేషన్లు వేయగా.. స్వతంత్ర అభ్యర్థిగా ఈదర హరిబాబు పోటీలో నిలుచున్నారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక రోజున వైసీపీకి చెందిన ఒక జడ్పీటీసీపై కేసు బనాయించి ఓటింగ్‌కు గౌర్హాజరయ్యేలా టీడీపీ పోలీసు అధికారాన్ని ఉపయోగించింది. దీంతో వైసీపీ బలం 27కు పడిపోయింది. ఈదర హరిబాబుతో పాటు 28 సీట్లు ఉన్న తమకే జడ్పీ పీఠం దక్కుతుందని టీడీపీ నేతలు సంబరాల్లో ఉన్నారు. అప్పటి మంత్రి శిద్ధా రాఘవరావు సహా ఇతర సీనియర్‌నేతలు సర్ధి చెప్పిన ఈదర హరిబాబు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు.
31 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న తమకు దక్కాల్సిన జడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ అధికార బలంతో, ఫిరాయింపు రాజకీయాలతో గెలుచుకోవాలని యత్నించడాన్ని వైసీపీ తనదైన శైలిలో అడ్డుకుంది. చివరి నిమిషంలో ఈదర హరిబాబుకు మద్ధతు తెలిపింది. దీంతో 28 స్థానాలతో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్ అయ్యారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలజీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది.
అధికారాన్ని ఉపయోగించి కొన్నాళ్లకు ఈదర హరిబాబును జడ్పీ పీఠం నుంచి తప్పించారు. ఈ సమయంలో వైస్ చైర్మన్ గా ఉన్న నూకసాని బాలాజీని తమ వైపునకు తిప్పుకున్న టీడీపీ.. ఆయన్ను జడ్పీ చైర్మన్‌ను చేసింది. అయితే ఈదర హరిబాబు హైకోర్టులో పోరాడి.. మళ్లీ జడ్పీ చైర్మన్ అయ్యారు. మధ్యలో కొన్ని నెలలు మినహా.. మిగతా కాలమంతా ఈదర హరిబాబే జడ్పీ చైర్మన్‌గా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఈదర హరిబాబు రాజకీయంగా చురుకుగా లేరు. ప్రస్తుతం కుటుంబం, వ్యాపారాలు చూసుకుంటున్న ఈదర హరిబాబు.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే ఆశతో ఆయన అనుచరులు, అభిమానులు ఉన్నారు. మరి ఆ అవకాశం కాలం ఈదర హరిబాబుకు ఇస్తుందా..? వేచి చూడాలి.
Also Read : అందరివాడు మురళి.. ఫలించిన కృషి..