విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలా అయ్యింది …?

సుమారు 55ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విధ్యార్ధులు , కార్మికులు విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు అనే నినాదంతో విశాఖ కేంద్రంగా గొప్ప ఉద్యమాన్ని నడిపారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం నాడు జరిగిన ఉద్యమంలో 32మంది అమరులయ్యారు. భారత దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకన్నా నాడు పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ వెనకపడి ఉండటం అప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఒక్క భారి పరిశ్రమ కూడా మంజూరు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన ప్రజలు హమీగా వచ్చిన పరిశ్రమను కాపాడుకునేందుకు చూపిన దైర్య సాహసాలు తెలుగు నేలపై వీరోచిత చరిత్రగా నిలిచి పోయాయి. ఒక పరిశ్రమ కోసం ప్రాంతీయ భావనలను పక్కన పెట్టి ఆంద్ర , తెలంగాణ , రాయలసీమ ప్రాంత ప్రజలు ఒక్క మాటపై సాగిన ఉద్యమం ఇది ఒక్కటే అని చెప్పటం లో అతిశయోక్తి లేదు.

భారతదేశంలో 1964నాటికే నాలుగు ఉక్కు కర్మాగారాలు ఉన్నప్పటికి ఉక్కు కొరత కోట్ల టన్నుల్లో ఉండటంతో 5వ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఆంగ్లో – అమెరికన్ కన్సార్టీయం నిపుణుల బృందం 1964 అక్టోబర్ 26న దేశానికివచ్చి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మానానికి సంభంధించి ప్రాధమిక సాంకేతిక పరిశీలన కొనసాగించారు. ఆ తరువాత 27 జనవరి 1964న ఐదవ ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై భారత ప్రభుత్వంతో డిల్లిలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఏడాదికి 1965 జులై 4న ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలుగా అనువైన ప్రదేశం అని నివేదికను విడుదల చేశారు.

Also Read: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి జగన్ లేఖ

విశాఖను ఎంచుకునేందుకు నివేదిక లో వారి పొందుపరిచిన అంశాలను చూస్తే ఈ దేశంలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలో విశాఖ పట్నం అనువైన ప్రాంతం అని. విశాఖను ఎంచుకోవడం మూలాన యంత్ర సామాగ్రి రవాణా , గని తవ్వకం , ఉత్పత్తి రవాణా మొదలైన పెట్టుబడి ఖర్చులో 11 కోట్ల 72 వేలు కలిసి వస్తుందని అబిప్రాయపడింది. అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం మూలాన కలిగే లాభాలను వివరిస్తూ భారత దేశంలో ఇతర ఉక్కు కర్మాగారాలు అభివృద్ది చెందే కొద్దీ సముద్ర తీరంలో ఉన్న ఉక్కు కర్మాగారం కోక్ బోగ్గును పూర్తిగా కానీ పాక్షికంగా కానీ దిగుమతి చేసుకుని ఉపయొగించుకోగలుగుతుందని ఆవిధంగా గనులలోని బొగ్గుకు, బొగ్గుశుద్ది కర్మాగారాలకు, రైల్వేలపై ఒత్తిడి తగ్గుతుందని, అప్పటికప్పుడు అవసరమయ్యే వివిద రకాలైన ముడి వస్తువులను దిగిమతి చేసుకోవడానికి సముద్ర తీరం అనువుగా ఉంటుందని , అలాగే సులభంగా తయరయిన వస్తువులను ఎగుమతి చేసుకోవచ్చని అన్నిటికన్నా సముద్ర తీర ఉక్కు కర్మాగరానికి ఆర్ధికంగా మద్దతు లభిస్తుందని . అమెరికా యురప్ దేశాల పబ్లిక్ ప్రయివేట్ పారిశ్రామిక వేత్తలు ఆర్ధిక సహాయం చేయడానికి సముద్ర తీర ఉక్కు కర్మాగారానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని తన నివేదికలో పేర్కొంది . దక్షినాదిలో ఎక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసినా తమకు ఆమోదయొగ్యమే అని గనుల శాఖా మంత్రి హోదాలో నీలం సంజీవరెడ్డి ప్రకటన చేసినప్పటికి నిపుణుల బృందం విశాఖకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక్కడి ప్రజల్లో పరిశ్రమ రాబోతుందని ఉపాది అవకాశాలు దోరుకుతాయనే ఆశలు కలిగాయి.

అయితే ఉక్కు కర్మాగారానికి సంభందించి విశాఖకు అనువైన ప్రదేశంగా సూచించినప్పటికి కర్నాటక , తమిళనాడు కు చెందిన (కామ్రాజ్ నాడర్ , నిజలింగప్ప ) రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు నడిపి 5వ ఉక్కు పరిశ్రమ తమ రాష్ట్రాలకు తీసుకుని పోయే ప్రయత్నం ముమ్మరం చేశారు. అలాగే అశోక్ మెహత, ఎస్.కే పాటిల్ లాంటి వారు ప్రధాని ఇందిరతో చర్చించి ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటనను వాయిదా వేయాలని సూచించారు. అదే సమయంలో నాలుగో ఫైనాన్స్ కమిషన్ విశాఖలో భారీ ఉక్కు కర్మాగార నిర్మాణం పై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం స్థాపించబోయే 5వ ఉక్కు పరిశ్రమకి స్థల నిర్ణయంలో విశాఖ కన్నా గోవా – హోస్పేట్ ప్రాంతాలకు ఎక్కువ అవకాశం ఉందని, లేని పక్షంలో అంత పెద్ద ఫ్యాక్టరీ ఒక్క చోట ఏర్పాటు చేయడం కన్నా ముక్కలు చేసి మూడు నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయడం మంచిదని ఉక్కు గనుల భారీ ఇంజినీరింగ్ శాఖా మంత్రి సుబ్రహమణ్యం తన అభిప్రాయాన్ని ప్రకటించారు.

Also Read: విశాఖ ఉక్కు – పట్టు బిగించిన ఆంధ్ర రాజకీయ పక్షాలు

ప్రధానిగా ఉన్న లాల్ బహ్దూర్ శాస్త్రి బహిరంగ సభలో విశాఖకు ఉక్కు పరిశ్రమ రాబోతుందని హామీ ఇవ్వడం. దానికి తగ్గట్టే అమెరికన్ కన్సార్టియం వారు విశాఖను అనువైన ప్రదేశంగా ప్రకటించడంతో ఉక్కు పరిశ్రమ తద్యం అని అనుకున్న ఆంద్రుల ఆశలపై నీలి నీడలు కమ్మడం మొదలుపెట్టాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు రాష్ట్రానికి ప్రకటించి రెండు ఏళ్ళు గడిచినా, విశాఖలో 5వ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని 21 ఫిబ్రవరి 1966న ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న చెన్నా రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించినా కేంద్రం నుంచి ఎంటువంటి స్పందనా లేకపోవడంతో, ఆంద్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనకబడి ఉన్నపటికీ కేంద్రం రాష్ట్రం పట్ల చిన్న చూపు చుస్తుందని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం నిపుణులు విశాఖ పట్టణానికే ప్రాధాన్యం ఇచ్చినప్పటికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల వారు చేస్తున్న రాజకీయ వత్తుడులకి లోనై విశాఖలో ఉక్కు కర్మాగారం నిర్మాణంకి సంభందించి ప్రకటన చేయకపోవడం శోచనియం అని చెబుతూ గుంటూరు జిల్లా, తాడికొండకు చెందిన అమృతరావు 15 అక్టోబర్ 1966న విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్షకు కుర్చున్నారు. అమృతరావు నిరాహారదీక్ష 12వ రోజు చేరడంతో అమృతరావుకు మద్దతుగా తిరుపతి వెంకటేశ్వరా యునివర్సిటి ఇంజినీరింగ్ కాలేజీ విధ్యార్ధులు విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు అనే పేరున ఒక కరపత్రం విడుదల చేసి రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమ ఎందుకు అవసరమో వివరించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్ తో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని ఇందిరా గాంధీకు వివరించగా విశాఖలో ఐదవ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సమస్య పరిశీలించడానికి ఇందిరా గాంధి 28 అక్టోబర్ 1966న మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. అయితే ఆ రెండు మూడు రోజులోనే రాష్ట్రంలో ఉధ్యమం ఉదృతమై అన్ని జిల్లాల ప్రజలు విధ్యార్ధి సంఘాలు , ప్రజాపార్టీ సారధి తెన్నేటి విశ్వనాధం, వావిలాల , నాగిరెడ్డి, గౌతు లచ్చన్న లాంటి ప్రముఖులు ఆద్వర్యంలో రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా ఉధ్యమంలోకి దూకడంతో పరిస్థితులు అదుపు తప్పి పోలీస్ కాల్పులు ఇతర అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి . ఉద్యమంలో పాల్గొన్న 32 మంది సామాన్యులు ప్రాణలు కోల్పోయారు. విశాఖలో 12 మంది, గుంటురులో 5, విజయవాడలో 5, విజయనగరం, కాకినాడ, వరంగల్, జగిత్యాల, పీలేరు, విజయనగరం, పలాస, రాజమండ్రిలలో ఒక్కొక్కరు చొప్పున , మరో ఇద్దరు మొత్తం కలిపి 32 మంది అమరులయ్యారు.

Also Read: అయ్యన్నా.. ఇంత అడ్డగోలుగానా.?

ఇందిరా గాంధి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం 1966 నవంబర్ 1న విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుని సమర్ధిస్తూ సిఫార్సు చేయగా విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఇందిరాగాంధి నుంచి హామీ రావడంతో 1966 నవంబర్ 3న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నిమ్మరసం ఇవ్వగా అమృతరావు దీక్ష విరమించారు. అమృతరావు దీక్ష విరమించాక ప్రభుత్వం ఆర్ధికంగా కుదుటపడిన తరువాతే నిర్మాణం ప్రారంభం అవుతుందని ఇందిరా గాంది స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్రం మోసం చేసిందని ప్రకటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపార్టీ కార్య దర్శిగా ఉన్న పత్తి శేషయ్య నిరాహార దీక్ష ప్రారంభించారు, 31రోజుల పాటు దీక్షలో కొనసాగారు. కమ్యూనిస్ట్లు నేషనల్ డెమోక్రట్స్ ఇండిపెండెంట్లు, స్వతంత్ర పార్టీ సభ్యులు శాసన సభ్యత్వానికి రాజీనామాలు చేశారు.

1967లో జరిగిన జనరల్ ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యను ప్రధాన సమస్యగా తీసుకుని తెన్నేటి విశ్వనాధం ఇండిపెండెంట్ అభ్యర్ధిగా విశాఖ పార్లమెంట్ నుండి పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్ధిపై ఘనవిజయాన్ని సాధించారు. తరువాత మూడేళ్లకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటూ, 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటన చేశారు.

Also Read: లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన చివరి “స్వతంత్ర” అభ్యర్థి తెన్నేటి విశ్వనాధం

1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ప్రధాని ఇందిరా గాంధి శంకుస్థాపన చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పడాలన్న అంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఎన్నో అవరోధాలను దాటుకుంటూ, అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న ఉక్కు పరిశ్రమ నేడు కేంద్ర ప్రభుత్వం 100శాతం ప్రయివేటీకరణ చేయడానికి నిర్ణయించడం శోచనీయం . 32 గ్రామల రైతులు 22వేల ఎకరాల భూములు త్యాగం చేసి ఏర్పడిన స్టీల్ ప్లాంట్ రక్షణకు జగన్ ప్రభుత్వం పూనుకుని కేంద్రానికి పరిశ్రమ అభివృద్దికి తీసుకోవల్సిన చర్యలను నిర్మాణాత్మకంగా వివరిస్తు లేఖ రాయడం అభినందనీయం. ఘనమైన చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు సైతం ముందుకు వచ్చి కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఇంది. ఆదిశగా వారు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Show comments