ఆర్జీవీ అంకిత‌మిచ్చిన ఆ ప్రముఖ తండ్రీకొడుకులెవ‌రు?

“క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు” సినిమాను ప్ర‌ముఖ తండ్రీకొడుకుల‌కు అంకిత‌మిచ్చినట్టు ఆ చిత్ర‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ అన్నాడు. “క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు” సినిమా విడుద‌ల‌కు రెండురోజుల ముందు బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడాడు. సినిమా అంకితం విష‌య‌మై విలేక‌రులు “ఇంత‌కూ ఎవ‌రా ప్ర‌ముఖ తండ్రీకొడుకు”ల‌ని ప్ర‌శ్నించ‌గా, ఆ విష‌యాన్ని మాత్రం అడ‌గ‌కండ‌ని త‌ప్పించుకున్నాడు. మీ అంద‌రికీ తెలుసన‌ని మాత్ర‌మే జ‌వాబిచ్చాడు.

తాను తీసిన మొట్ట‌మొద‌టి మెసేజ్ ఓరియెంటెండ్ సినిమాగా ఆయ‌న పేర్కొన్నాడు. తానూ ఏ వ‌ర్గాన్ని ఈ సినిమాలో కించ‌ప‌ర‌చ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు.

ఇప్ప‌టికే ఈ సినిమాపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వివాదం నెల‌కొంది. ఈ సినిమా క‌మ్మ‌, రెడ్ల వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేలా ఉంద‌ని, నిలిపివేయాల‌ని కోరుతూ ఇంద్ర‌సేనాచౌద‌రి అనే వ్య‌క్తి హైకోర్టులో కేసు వేశాడు. సినిమాపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సెన్సార్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో రాంగోపాల్‌వ‌ర్మ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించిన వివ‌రాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. తానెవ‌రినీ టార్గెట్ చేయ‌లేద‌ని విలేక‌రులు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూప‌లేద‌న్నాడు. అలాగే త‌న‌కు ఎవరి నుంచీ బెదిరింపులు రాలేద‌ని వ‌ర్మ వివ‌ర‌ణ ఇచ్చాడు.

తెలుగుదేశం నాయ‌కుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌కు, అభ్యంత‌రాల‌కు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టుగా ప్రెస్‌మీట్ సాగింది. సినిమాలో ప‌ప్పు వ‌డ్డించ‌డం అంద‌రికంటే ఎక్కువ‌గా టీడీపీ నాయ‌కుల‌కు న‌చ్చిన‌ట్టు త‌న‌కు తెలిసింద‌న్నాడు. త‌మ అభిప్రాయాల‌ను నా ద్వారా వెల్ల‌డించిన‌ట్టుగా ఫీల‌వుతున్న‌ట్టు టీడీపీ నేత‌లే త‌న‌కు చెప్పార‌న్నాడు. అలాగే కేఏ పాల్ గురించి ప్ర‌శ్నించ‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం మానేసి చాలా రోజులైందన్నాడు. ఇత‌రుల‌ను గిల్ల‌డం చిన్న‌ప్ప‌టి నుంచి అల‌వాట‌ని ఓ ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చాడు.

Show comments