యాభయ్యేళ్ళ కిందటే ఏకగ్రీవాలు

పంచాయతీ ఎన్నికల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్న తీరు, వేస్తున్న అడుగులు, చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఏకగ్రీవాలు మనకు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అధికారులకు చెబుతున్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అది అధికారుల వైఫల్యమేనంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. నాయకత్వం తీసుకునేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారంటూ. రాజకీయ నాయకుడి మాదిరిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా చిత్తూరు గుంటూరు లో ఏకగ్రీవాలు ప్రకటించవద్దు అంటు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.

ఏకగ్రీవాలు నేడు కొత్త కాదు …

గ్రామ ప్రజలందరు ఐక్యంగా తీసుకునే సమిష్టి నిర్ణయాల వలన సదరు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రజల మధ్య విభేదాలు రాకూడదనే సదుద్దేశంతో ఏకగ్రీవాలను గత పాలకులు కూడా ప్రోత్సహించారు. అందుకు నగుదు ప్రోత్సాహకం కూడా ఇచ్చారు. ఇదేమీ కొత్తగా వచ్చిన సాంప్రదాయం కాదు. రాష్ట్రంలో 57 ఏళ్ల క్రితమే ఉంది. 1964 న రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆ పల్లెలకు గ్రాంటులు ఇస్తామని నాటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటిచింది. మూడు వేలు పైన జనాభా ఉన్న పల్లెలకు 5 వేలు, మూడు వేలు లోపు జనాభా ఉన్న పల్లెలకు 2,500 రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించడం మూలాన నాడే ఏకంగా 3,124 పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఆయ్యాయి. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా ఏకగ్రీవమైన పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా 21,441 పంచాయతీలకు గాను 2,422 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులోనూ అత్యధికంగా చిత్తురు జిల్లాలో 293 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలు దశాబ్ధాలుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లా మొంటాడ మండలం చింతవలస, ఇద్దనవలస పంచాయితీలు 50ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. అప్పటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. ప్రతి ఎన్నిక సమయంలో గ్రామస్తులంతా ఏకమై ఒకే మాట మీద ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహకాలు తీసుకుంటు ఏకగ్రీవం చేసుకుంటు వస్తున్నారు . అలాగే గుంటూరు జిల్లా పెదకూరపాడు, 75 తాళ్ళూరు గ్రామాలు కూడా దశాబ్దాలుగా ఒకేమాట ఒకే బాటతో ఏకగ్రీవం చేసుకుంటు వస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఇటువంటి గ్రామాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి .

మరో విషయానికి వస్తే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడైనా ఏకగ్రీవాలు జరిగాయా..? అంటూ పంచాయతీ ఎన్నికలను జనరల్‌ ఎన్నికలతో ముడిపెట్టి తన పందాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు నిమ్మగడ్డ రమేష్. వాస్తవానికి ఎన్నికల కమీషన్ అధికారిగా ఉంటు ఆయన తెలియక ఈ వాఖ్య చేశారో లేక ప్రజలను తప్పుదోవ పట్టించి తనని తాను సమర్దించుకునేందుకు ఈ వాఖ్యలు చేశారో తెలియదు కాని తెలుగునాట శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవాలు అయిన చరిత్ర ఉంది. 1952లో జరిగిన ఎన్నికల్లో హైద్రబాద్ రాష్ట్రం పరిగి శాసన సభ నియోజకవర్గం నుండి షేక్ షాజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1956 ఉప ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి అల్లం కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా , 1957లో విజయనగరం ఉప ఎన్నికల్లో శ్రీరామమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో పొందూరు నుంచి కోటపల్లి పున్నయ్య, ఆలూరు నుంచి డి.లక్ష్మీకాంతరెడ్డి, గద్వాల్ నుంచి కృష్ణ రాం భూపాల్, వికారాబాద్ నుంచి ఎ.రామస్వామి, ఆర్మూరు నుంచి టి.రంగా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రజలు పార్టీల పరంగా విడిపోకూడదనే.. పంచాయతీ ఎన్నికలను పార్టీ రహిత గుర్తులతో నిర్వహిస్తారు. ఏకగీవ్రం వల్ల కలిగే లభాలు ఏమిటి..? ప్రజలకు, పంచాయతీకి జరిగే మేలు ఏమిటన్న దాని పై ప్రభుత్వాలు, మీడియా చైతన్యం కలిగిస్తున్నాయి. చైతన్యవంతులైన ప్రజలు.. సమిష్టి నిర్ణయంతోనే ఏకగీవ్రం వైపు మొగ్గు చూపుతారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రాంటు తీసుకుని గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటారు . ఇందులో బయట వ్యక్తుల ప్రమేయం శూన్యం. పూర్తిగా సదరు గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తులదే నిర్ణయాధికారం. ఎవరో ఒత్తిడి చేస్తేనో, ప్రలోభాలు పెడితేనో జరిగేవి కావు. కానీ నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు జరగాల్సిందేనంటున్నారు. ఏకగ్రీవాలు జరగకుండా ప్రతి చోటా పోటీ నెలకొనడం వల్ల గ్రామాల్లో వర్గాలు ఏర్పడతాయి. ఇది ఎవరికి మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Show comments