ధరణి వెబ్‌సైట్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. మాడ్యూళ్ల మార్పుకు చాన్స్‌!

ధరణి వెబ్‌సైట్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. మాడ్యూళ్ల మార్పుకు చాన్స్‌!

రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాడ్యుళ్ల మార్పుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ధరణి పోర్టల్‌లో ఉన్న ఐదు మాడ్యుళ్లు మార్చుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ అవకాశం కల్పించింది. ఇందులో కొన్ని మాడ్యుళ్లలో కలెక్టర్ లాగిన్ చేసే విషయంలో అలాగే మరికొన్ని మాడ్యుల్స్‌లో తహశీల్దార్ సమక్షంలో మార్పులు చేసే సదుపాయం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు.. రైతుల భూమిలో కొంత భాగాన్ని అమ్మినా కూడా ఆ రైతు పాస్‌బుక్‌లో పూర్తి భూమి విస్తీర్ణం కొనసాగుతూ వస్తోంది.

అయితే తాజాగా ఇచ్చిన అవకాశంతో విక్రయించిన భాగాన్ని గుర్తించి దాన్ని మార్పులు చేసేందుకు కలెక్టర్ లాగిన్‌లో సాధ్యపడుతుంది అని అధికారులు తెలిపారు. అలాగే దీంతో పాటు సర్వే నంబర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల భూమి వినియోగ విధానంలో మార్పు అయిన భూములు అలానే సర్వే నంబర్లు లేని ఇళ్ల స్థలాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నెంబర్ల లేని ప్రభుత్వ భూములకు కూడా వర్తిస్తుంది. దీనితో పాటు పౌరుల లాగిన్‌లో కూడా ఈ అవకాశం కల్పించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా అనుసంధానమైనట్లైతే వాటిని తహశీల్దార్ లాగిన్‌లో మార్చుకోవచ్చు.

అంతేకాక భూమి, దానికి సంబంధించిన యజమానిది కాకుండా ఒకవేళ పొరపాటుగా ఇతర ఆధార్ కార్డు నంబర్లు అనుసంధానమైనా కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. పలు సంస్థలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించి తప్పులు ఉంటే.. వాటిని కూడా కలెక్టర్‌ల లాగిన్‌లో మార్పులు చేసుకోవచ్చు. అలాగే నకిలీ సర్వే నంబర్లు ఉన్నా.. ఒకవేళ ఒకే నంబర్ రెండు సార్లు నమోదైనా వాటిలో మార్పులు చేసేందుకు తహశీల్దార్ లాగిన్‌లో సదుపాయం కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అనేక సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు.

Show comments