కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ : ఎమ్మెల్సీ బ‌రిలో పీవీ కుమార్తె?

  • Published - 02:45 AM, Mon - 22 February 21
కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ : ఎమ్మెల్సీ బ‌రిలో పీవీ కుమార్తె?

తెలంగాణ‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లను అన్ని పార్టీలూ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. మార్చి 14న ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీంతో పార్టీల‌న్నీ అభ్య‌ర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశాయి. ఖ‌మ్మం – వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అవకాశం క‌ల్పించారు. ప్ర‌చారంలో కూడా ఆయ‌న దూసుకెళ్తున్నారు.

దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఖ‌రారులో ఆల‌స్యం కార‌ణంగా ప్ర‌చారంలో వేగం త‌గ్గింద‌ని భావించిన కాంగ్రెస్ కూడా ముందుగానే రెండు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.హైౖదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని, వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ స్థానానికి నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. వారు కూడా ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ‌పై క‌న్నేసిన బీజేపీ కూడా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుత‌ ఎమ్మెల్సీ రాంచంద‌ర్‌రావు పేరును, వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి గుజ్జుల ప్రేమేంద‌ర్ రెడ్డి పేరును ఖ‌రారు చేసింది. వారి గెలుపు కోసం ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇప్ప‌టికే రంగంలోకి దిగారు.

ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్రకటించగా,టీఆర్ఎస్ మాత్రం ఒక స్థానానికే ఇప్ప‌టి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. హైౖదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానానికి ఇప్ప‌టి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. గ‌త రెండు ప‌ర్యాయాలు ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ ఓట‌మి పాలైంది. దీంతో ద‌ఫా పోటీ చేసే ఆలోచ‌న‌లో లేద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అలాగే మాజీ మేయ‌ర్ బొ్ంతు రామ్మోహ‌న్ ను పోటీ చేయాల‌ని కోర‌గా ఆయ‌న విముఖ‌త చూపార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలో అనూహ్యంగా తెర‌పైకి దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవి పేరు తెర‌పైకి వ‌చ్చింది.

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ కొంత కాలంగా పీవీ న‌ర‌సింహారావుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వ‌హిస్తున్నారు. పీవీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాసనమండలికి గవర్నర్‌ కోటాలో నామినేట్ చేస్తార‌ని గ‌తంలో ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీలో దింప‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత అయిన‌ప్ప‌టికీ తెలంగాణ‌కు చెందిన దివంగ‌త ప్ర‌ధాని పీవీకి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద‌ని ఇప్ప‌టికే గుర్తింపు పొందుతోంది. ఈ క్ర‌మంలో పీవీ కుమార్తెను పోటీలో దింప‌డం ద్వారా ఆయ‌న కుటుంబానికి,బ్రాహ్మణులకు టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోంద‌న్న పేరుతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని త‌గ్గించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని, మ‌రోవైపు బీజేపీకి కూడా చెక్ పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో వాణిదేవి కూడా త‌మ కుటుంబాన్ని గుర్తించ‌డంలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌త జ‌యంతి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌లో సీఎం కేసీఆర్ చొర‌వ‌పై సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో విద్యాసంస్థ‌ల అధిప‌తిగా, సామాజిక వేత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వాణిదేవి టీఆర్ఎస్ నుంచి హైౖదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానంలో పోటీకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు కావ‌డంతో వాణిదేవి అభ్య‌ర్థిత్వాన్ని కేసీఆర్ ఖ‌రారు చేసిన‌ట్లేన‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Show comments