అర్జున్ టెండూల్కర్.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న పేరు..వైరల్ కావడం అంటే పాజిటివ్ గా మాత్రం కాదు.. ఐపిఎల్ వేలం అనంతరం అర్జున్ టెండూల్కర్‌ను ట్రోల్ చేసే నెటిజన్లు ఎక్కువయ్యారు.. 20 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ అదే ధరకు సొంతం చేసుకోవడంపై ట్రోలింగ్ మొదలైంది. నెపోటిజం సినీ పరిశ్రమలోనే కాకుండా క్రీడల్లో కూడా ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తూ అర్జున్ టెండూల్కర్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
కాగా అర్జున్ టెండూల్కర్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నామని చెప్పుకొచ్చిన జయవర్ధనే క్రికెట్ పట్ల తనకున్న శ్రద్ధ అమోఘమని వెల్లడించాడు.ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా అర్జున్ టెండూల్కర్ ఎంపికను సమర్ధించాడు.
క్రీడల్లో కూడా తల్లిదండ్రులకున్న పలుకుబడి కారణంగా కొందరు అవకాశాలు పొందుతారని అవకాశాలు వచ్చినా తమ ఆటలో నైపుణ్యం లేకపోవడం వల్ల ముందు అవకాశం దక్కినా తర్వాత తెలిపోతారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ రాజకీయవేత్త బీహార్ మాజీ ముఖ్యమంత్రులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీ దేవి దంపతుల కుమారుడు తేజస్వి యాదవ్ క్రికెట్ కెరీర్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
బీహార్ రాష్ట్ర ప్రతిపక్ష ఆర్జేడీ నేతగా ఉన్న తేజస్వి యాదవ్ మొదట్లో క్రికెటర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం చాలా తక్కువమందికి తెలుసు.. క్రికెట్ అంటే ఇష్టం పెంచుకున్న తేజస్వి యాదవ్ కి క్రికెటర్ గా టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఆశలు ఉండేవి. జార్ఖండ్ క్రికెట్ టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి యాదవ్ ని 2008లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపిఎల్ వేలంలో కొనుగోలు చేసింది. కేవలం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్,రెండు లిస్ట్ ఏ మ్యాచులు,నాలుగు టీ20 మ్యాచులు ఆడిన తేజస్వి యాదవ్ ఏ ఒక్క మ్యాచులోను రాణించలేదు. ఒక్క మ్యాచులో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకున్నా ఢిల్లీ క్యాపిటల్స్ తేజస్వి యాదవ్ ను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం.
అలా 2008 లో ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యుడైన తేజస్వి యాదవ్ 2012 వరకూ కొనసాగినప్పటికి రిజర్వ్ బెంచుకు మాత్రమే పరిమితం అయ్యాడు. 2013 లో క్రికెట్ నుండి రిటైర్ అయిన తేజస్వి అనంతరం బిహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగాడు. కాగా కొందరు తేజస్వి యాదవ్ ను అర్జున్ టెండూల్కర్ ను పోల్చి చూస్తూ టాలెంట్ కారణంగా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం రాలేదని తల్లిదండ్రులకు ఉన్న పలుకుబడి కారణంగానే చోటు లభించిందని ట్రోల్ చేయడం ప్రారంభించారు.
తాజాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కూడా అర్జున్ టెండూల్కర్ సామర్ధ్యాన్ని చూడకుండా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టాడు. కెరీర్ మొదలుపెట్టకముందే అర్జున్ టెండూల్కర్ సామర్ధ్యంపై సందేహాలు వెలిబుచ్చుతూ ట్రోల్ చేయడం సరికాదని ఒకే జిమ్ లో మేమిద్దరం కసరత్తులు చేస్తామని మెరుగైన క్రికెటర్ కావడం కోసం అర్జున్ శ్రమిస్తూ ఉంటాడని ఫర్హాన్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అర్జున్ సామర్ధ్యం ఎలాంటిదో ముందు ముందు ఏదొక మ్యాచులో బయటపడుతుందని అప్పటివరకూ ట్రోల్ చేయడం సమంజసం కాదని కొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
నైపుణ్యం చూసి సెలెక్ట్ చేసారా లేక నెపోటిజం కారణంగా అర్జున్ ని వేలంలో కొనుగోలు చేశార అన్నది పక్కనబెడితే అర్జున్ టెండూల్కర్ సామర్థ్యం చూడకుండా ఏకపక్షంగా ట్రోలింగ్ చేయడం సమంజసం కాదు. ఒకవేళ అతనిలో ఏ విధమైన నైపుణ్యం లేకుంటే జట్టులో చోటు నిలుపుకోవడమే గగనం అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే భవిష్యత్ ఆశాకిరణంగా మారుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఏదిఏమైనా ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ పై చేస్తున్న memes సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం గమనార్హం. ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా అర్జున్ పై ఒత్తిడి పెరుగుతుందని అది అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అతనిలో టాలెంట్ ఉందొ లేదో కొద్ది రోజుల్లో తెలిసిపోతుందని అంతవరకూ ట్రోల్ చేయడం నిలిపివేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.